🔱🌺 అమ్మవారి పాదపద్మముల మహిమ 🌺🔱కామాక్షీ సౌందర్యలహరి – 4వ శ్లోకము

 🕉️🔱 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


⚜️🚩కామాక్షీ సౌందర్యలహరి – 4వ శ్లోకము 


🔱🌺 అమ్మవారి పాదపద్మముల మహిమ 🌺🔱


త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః

త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా I

భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికమ్

శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ II 4 II


🌹తాత్పర్యముః

అమ్మా!  సకల లోకములకు దిక్కైన ఓ జగదంబికా!

నీవు తప్ప ఇతరములైన దేవతాగణములు అందరూ,

వారి వారి భక్తుల యొక్క కోర్కెలు తీర్చుటకు వామ హస్తముతో వరద ముద్ర,

అలాగే భయమును తీర్చుటకు కుడివైపు చేతితో అభయ ముద్ర పడతారు తల్లీ,

కానీ నీవు మాత్రం ఆ విధంగా వర, అభయ ముద్రలను ప్రకటించవలసిన అవసరం లేకుండా,

భక్తుల యొక్క భయమును తీర్చుటకైనా,

అలాగే భక్తులు కోరిన దానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇవ్వడానికైనా,

పరమపావనమైన నీయొక్క చరణములే సమర్ధములై ఉన్నాయి అమ్మా.

                             🔱🌺🔱🌺🔱


⚜️🚩"శరణ్యే లోకానాం"

🌹అంటే, జగజ్జనని అయిన అమ్మవారి పాదములు సకల లోకాలకు దిక్కు.

సకల జీవకోటికి, దేవతలకు సైతం శరణ్యం అమ్మవారే.

అమ్మవారు పరాశక్తి స్వరూపిణి.

అమ్మవారు అనుగ్రహించక పోతే, యావత్ జగత్తు అస్థిత్వం కోల్పోతుంది.

ఇక దేవతలకైనా సరే – అమ్మవారి శక్తి లేకపోతే, బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా వారి కర్తవ్యములను నెరవేర్చలేరు. 


🌹భగవత్స్వరూపములు భక్తులను అనుగ్రహించడానికి, వివిధ ముద్రలను, ఆయుధాలను చేత పట్టుకుని ఉంటారు.

భక్తులను వివిధ రీతులలో రక్షించడానికి, మన కామ్యములు తీర్చుట కొరకు, మనలోని అంతఃశత్రువులను జయించడానికి, దుష్ట శిక్షణ –శిష్ట రక్షణ చూపడానికి సంకేతముగా ఈ ముద్రలుగానీ, ఆయుధములు కానీ భగవంతుడు ధరిస్తాడు.


🌹ఎవరైనా దేవతా మూర్తి వరద ముద్ర పడితే దానర్ధం – భక్తుల యొక్క కామ్యార్ధములను తీర్చగల సమర్ధత.

అంటే ఇది పోషణ శక్తిని సూచిస్తుంది.


🌹అభయ ముద్ర అంటే – భయమును తీసివేయునది, రక్షణ కలిగించునది.

ఇది రక్షణ సామర్ధ్యం కాబట్టి కుడి చేతితో ఈ ముద్ర పడతారు.


🌹లలితా పరాభట్టారికా స్వరూపంలో ఉన్న అమ్మవారు నాలుగు చేతులలో పాశము అంకుశము, చెరుకు విల్లు, ఐదు పుష్పాలు మాత్రమే పట్టుకుంటుంది తప్ప, ముద్రలు ఏమీ పట్టదు.


🌹ఈ నాలుగవ శ్లోకములో శంకరభగవత్పాదుల వారు అంటున్నారు –

“అమ్మా!! ఇతర దేవతా గణములు ఆ విధంగా ఒక చేతితో వరద ముద్ర ఒక చేతితో అభయముద్ర పడతారమ్మా, కానీ నీవు మాత్రం అలా అభినయించవలసిన అవసరం లేదు తల్లీ, నీ చరణ కమలములే ఆ రెంటినీ ఇవ్వడానికి సమర్ధమై ఉన్నాయి” అని.


🌹అంటే అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తే చాలు, అమ్మ పాదములే మనకి అభయమును, మరియు వరప్రదానము రెండూ ఇవ్వగలవు.

అమ్మవారి పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తే చాలు, ఇహములో మనకి కావలసిన సకల కామ్యములు అమ్మ ఇస్తుంది.


⚜️🚩"భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం"

🌹అంటే అమ్మ పాదములు భయాన్ని తొలగించి, మనం కోరినదానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని.

నిజమే కదా!

లౌకికమైన మనల్ని కన్న అమ్మే, మనకి ఏదైనా ఇవ్వాల్సి వస్తే, అన్నం పెట్టడం దగ్గర నుంచి, ఏదైనా సరే, మనం అడిగిన దాని కంటే, కోరిన దాని కంటే ఎక్కువ కొసరి కొసరి బలవంతపెట్టి మరీ తినిపిస్తుంది.

మరి సకల జీవకోటికి మాత, జగదంబిక మనం కోరిన దానికంటే ఎక్కువ ఫలాన్నిస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏముంది.


🌹ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే సామ్రాజ్య సిద్ధి, మోక్షసిద్ధి కలుగుతాయి.

🌹సేకరణ

                             🔱🕉️🔱🕉️🔱🕉️🔱


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు