కృష్ణం వందే జగద్గురుం 🌹🙏భాగవతం బాణాసురుడు కధ
🕉️⚜️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏
భాగవతం
⚜️🚩పూర్వం బలిచక్రవర్తి యొక్క పెద్ద కుమారుడైన
"వెయ్యి బాహువులు" కలిగిన బాణాసురుడు శివుణ్ణి మెప్పించి పార్వతి దేవితో సహా తన కోటకి కాపలా ఉండేలాగా వరం పొందాడు.
🌹అలా తన కోటకి కాపలా కాస్తున్న శివునితో ఇలా అన్నాడు.
"శివా! మీరు నా కోటకు కాపలా కాస్తున్నప్పటి నుండి నా వైపు శత్రువులు కన్నెత్తి కూడా చూడడం లేదు.
నాకు యుద్ధం చేయాలని కోరికగా ఉంది.
కాబట్టి మీరే నాతో యుద్ధం చేసి నా కోరికను మన్నించండి" అన్నాడు.
🌹అప్పుడు శివుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు.
"నాయనా నువ్వు నన్ను కాపలాగా పెట్టుకున్నావు కాబట్టి, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయలేను.
కాస్త ఓపిక పట్టు.
నాతో సమానమైన వాడు త్వరలోనే నీ కోరిక తీరుస్తాడు.
ఆయన వచ్చిన రోజు నీ రథానికి ఉన్న జెండా క్రింద
పడిపోతుంది.
అప్పుడు నీకు సరైన యుద్ధం దొరుకుతుంది" అన్నాడు శివ పరమాత్మ.
ఆ మాటలకు బాణాసురుడు సంతోషించాడు.
🌹ఆ బాణాసురుడికి #ఉష అనే ఒక కుమార్తె
ఉంది.
ఒకరోజు శివుడు తన మాయతో ఆమెకు కృష్ణుని
మనవడైన అనిరుద్ధునితో రమించినట్లుగా కల వచ్చేలా చేశాడు.
ఉష నిద్రలేచాక కలలో చూసిన అనిరుద్దున్నే
తలుచుకుంటూ దిగులుగా ఉంది.
మాయలు తెలిసిన చిత్రలేఖ అనే తన స్నేహతురాలి ద్వారా #ద్వారక నుండి అనిరుద్ధున్ని ఆకాశమార్గంలో తన మందిరానికి తెప్పించుకున్నది.
కృష్ణునికి ఇదంతా తెలిసినా ఏమీ తెలియని వాడి లాగా నిద్రపోయాడు.
అనిరుద్ధుడు కూడా ఉషతో కొన్ని నెలలపాటు ఆమె
మందిరంలోనే ఉన్నాడు.
ఆమె గర్భవతి అయ్యింది.
🌹విషయం తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధున్ని నాగపాశంతో బంధించాడు.
వెంటనే బాణాసురుడి రథం మీది జండా క్రింద పడిపోయింది.
అంటే కృష్ణ పరమాత్మ వచ్చే సమయం ఆసన్నమైంది.
🌹ఈ లోగా నారదుడు ద్వారకకు వెళ్లి అక్కడి వాళ్లకు అనిరుద్ధుడు బంధీ అయిన విషయం చెప్పాడు.
అందరూ యుద్ధానికి బయలుదేరారు.
కృష్ణుడు కూడా ఏమీ తెలియనట్లు వారితో బయలుదేరాడు.
వాళ్ళు రాగానే బాణాసురుడు తనకు కాపలా ఉన్న శివున్ని కృష్ణుని మీదకు యుద్దానికి పంపాడు.
ఇచ్చిన మాట ప్రకారం శివుడు కృష్ణునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
🌹కాసేపటి తర్వాత కృష్ణుని బాణానికి శివుడు నందీశ్వరుని మీద వాలి మూర్చపోయినట్టు నటించాడు.
వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు.
కాసేపటి తర్వాత యుద్ధంలో బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది.
శ్రీకృష్ణుని శక్తి తెలిసిన బాణాసురుడి తల్లి అయిన కోటర,
తన కొడుకుని కాపాడుకోవడానికి జుట్టు విరబోసుకుని, వివస్త్రురాలై,
హాహా కారాలు చేస్తూ వాళ్లిద్దరి మధ్య నిలబడింది.
ఒక స్త్రీ వివస్త్రురాలై ఎదురుగా నిలబడితే కృష్ణుడు ధనుస్సును పక్కన పెట్టి యుద్దాన్ని ఆపేశాడు.
అదును చూసి బాణాసురుడు కోటలోకి పారిపోయాడు.
🌹మరుసటి రోజు మరల యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శివుడు కృష్ణున్ని ఇలా ప్రార్థించాడు.
"నేను కాపలా ఉన్నంత కాలం వీడు మరణించడానికి వీలులేదు.
కాబట్టి వీడిని చంపకుండా ఏదైనా శిక్ష వెయ్యి" అన్నాడు.
🌹నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడిని విడిచి పెడుతున్నాను.
బాణుడు శివభక్తులలో అగ్రాసేరుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు.
తన సుదర్శన చక్రంతో వాడికున్న 1000 చేతులలో 996 చేతులు నరికేశాడు.
దాంతో బాణాసురుడికి ఉన్న అహంకారం తొలగిపోయింది.
🌹కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో గొప్ప శివ భక్తుడై ఆయన పరివారంలో చేరిపోయాడు.
ఆ రోజు నుండి శివుని కైలాసానికి కాపలాగా ఉన్నాడు బాణాసురుడు.
🌹సేకరణ
🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️

Comments
Post a Comment