మీనాక్షి పంచ రత్నమాల 🙏(స్తోత్రం)

 ఓం శ్రీ మాత్రే నమః 🙏

"సుందరేశ్వరుడు" సాక్షాత్తు శివుడు.

ఆయన భార్య పార్వతీదేవి మానవరూపంలో అవతరించి పాండ్య రాజ పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి, భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమశివుని సతీమణి అయింది.


మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతిదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చింది. 

మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.

ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు.


                    

  

 మీనాక్షి పంచ రత్నమాల 🙏(స్తోత్రం)


ఉద్యద్భాను సహస్రకోటి సదృశం కేయూర హారోజ్వలాం

బింబోష్టిస్మిత దంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం

విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం (1)


🌹ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనది, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నది, దొండపండ్లు వంటి పెదవులు కలది, చిరునవ్వులొలుకు దంతముల కాంతి కలది, పీతాంబరములను ధరించినది, విష్ణు- బ్రహ్మ- దేవేంద్రులచే సేవించబడునది. తత్త్వస్వరూపిణియైనది, శుభము కల్గించునది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం

శింజిన్నూపురకింకిణీం మణిధరాం పద్మప్రభాభాసురాం

సర్వాభీష్టవరప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం (2)


🌹ముత్యాలహారాలు అలంకరించిన కిరీటముతో శోభించుచున్నది, నిండు చంద్రుని వంటి ముఖకాంతి కలది, ఘల్లుమంటున్న అందెలు ధరించినది, పద్మముల వంటి సౌందర్యము కలది, కోరికలనన్నిటినీ తీర్చునది, హిమవంతుని కుమార్తెయైనది, సరస్వతి- లక్ష్మీదేవులచే సేవించబడుచున్నది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం

శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతీం శ్రీమజ్జగన్నాయికాం

శ్రీమఛ్చణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం (3)


🌹శ్రీ విద్యాస్వరూపిణి, శివుని ఎడమభాగమునందు నివసించునది, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైనది, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునది, ఐశ్వర్యవంతమైన సభకు అధి దేవతయైనది, కుమారస్వామి- వినాయకులకు కన్నతల్లియైనది, జగన్మోహినియైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం

శ్యామాంబాం కమలాసనార్చితపదాం నారాయణాస్యానుజాం

వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిరాడంబికాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం (4)


🌹సుందరేశ్వరుని భార్యయైనది, భయము తొలగింప చేయునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, నల్లని కాంతి కలది, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునది, నారాయణుని సోదరియైనది, వీణ- వేణు- మృదంగ వాద్యములను ఆస్వాదించునది, నానావిదములైన ఆడంబరములు కలది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


నానాయోగి మునీంద్రహౄద్యవసతీం నానార్థసిద్ధిప్రదాం

నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణేనార్చితాం

నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానాజగద్వాసికాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం (5) 


🌹అనేక యోగుల- మునీశ్వరుల హృయములందు నివశించునది, అనేక కార్యములను సిద్దింప చేయునది, బహువిధ పుష్పములతో అలంకరింపబడిన రెండు పాదములు కలది, నారాయణునిచే పూజింపబడునది, నాదబ్రహ్మ స్వరూపిణియైనది, శ్రేష్ఠమైనదాని కంటే శ్రేష్ఠమైనది, అనేక పదార్థముల తత్త్వమైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.

                    🔱🌷🔱🌷🔱🌷🔱🌷🔱

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం