మృత్యుంజయ మంత్రం... పూర్తి అర్థముతో🙏
ఓం నమఃశివాయ 🙏
🌹మృత్యుంజయ మంత్రం... పూర్తి అర్థముతో🙏
🌹మానవుడికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది...
"మహా మృత్యుంజయ మంత్రం"
🌹మృత్యుంజయ మంత్రం ఋగ్వేదం లోని ఒక మంత్రం.
దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు.
ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.
ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం|
ఉర్వారుకమివ బంధనాన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్||
🌹ఓం
అ-ఉ-మ ల సంగమమే ఓంకారం.
ఋగ్వేదం నుండి "అ" కారం.
యజుర్వేదం నుండి "ఉ" కారం,
సామవేదం నుండి "మ" కారాలు పుట్టి...
ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది.
ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవత్ రూపం.
ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది.
సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం.
కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది.
🌹త్రయంబకం
త్రయంబక మంటే మూడు నేత్రాలని అర్థం.
ఇంద్ర, అగ్ని, సామ తత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు.
భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం.
శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.
ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు.
అందుకే ఆ స్వామిని త్రయంబకం అని కీర్తిస్తున్నాం.
🌹యజామహే
అంటే ద్యానిస్తున్నానని అర్థం.
సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి.
సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది.
సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి.
ఆ స్వామిని ధ్యానించగా... స్వామి హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్త లోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం🙏
🌹సుగంధిం
సు... మంచిదైన, గంధ... సువాసన ద్రవ్యం.
ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు... మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు.
ఆయనకు తన పిల్లలమైన మన పట్ల ఎంతో ప్రేమ, వాత్సల్యం.
ఆయన ఎంత భక్త జన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు.
చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగ రూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు.
ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు.
ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
🌹పుష్టివర్థనం
మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి మనలను తప్పక కాపాడుతాడు.
ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ.
గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగిపోయాడు.
చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది.
దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు.
అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి... గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది.
గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు.
ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు.
ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో...
శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
🌹ఉర్వారుకం ఇవ బంధనం
దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.
🌹మృత్యోర్ముక్షీయ
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం.
మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు.
ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే.
భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.
🌹అమృతాత్
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు.
అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది.
కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.
🌹క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు మింగి మృత్యుంజయుడు అయ్యాడు.
ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం.
Comments
Post a Comment