శివ భగవానుడు🙏
ఓం నమః శివాయ 🙏
శివ భగవానుడు
"శమయతీతి శివః"... అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసేవాడు, శివుడు.
"శీతే సజ్జన మనస్సు ఇతి శివః"... సజ్జనుల మనస్సులలో శయనించి ఉండేవాడు, శివుడు.
"శివం వేదః తద్యోగాత్"... శివమంటే వేదము.
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపజేసే వేదము... శివమవుతుంది.
దాని యోగము గలవాడు శివుడు.
"శం నిత్య సుఖమానంద మికారః, పురుషః స్మృతః
వకారః శక్తిరమృతా మేళనం శివ ఉచ్యతేః"
అన్నది శివపురాణం.
‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము.
‘ఇ’ కారం - పరమ పురుషుడు.
‘వ’కారం అమృత స్వరూపిణి అయిన శక్తి.
ఈ ముగ్గురి కలయికయే ‘శివం’ అవుతుంది. ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థం.
ఓంకారము
దాన్ని విడదీస్తే ‘అ ఉమ్’ అయింది.
‘అ’ను ‘మ్’ ప్రక్కన చేరిస్తే ‘ఉమ’ అయింది.
ఉమ అంటే బ్రహ్మవిద్య. ఓంకారం బ్రహ్మవిద్య.
అందుకే ‘ఉమ’ను పరమశివుడు ఎప్పుడూ తన దేహార్ధ భాగంలో ఉంచుకొంటాడు.
వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది.
వారి భార్యాభర్తృ సంబంధము నిత్యము, శాశ్వతము.
దీనిననుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడింది.
పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు, ఆదిదంపతులు.
‘సనాతన’ అంటే ఎల్లప్పుడూ... నిత్యనూతనం అని అర్థం.
వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం.
కనిపించనిదంతా - అవ్యక్తం. ఆ అవ్యక్తం - శివస్వరూపం.
వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అర్ధనారీశ్వర తత్త్వం.
పరమశివుడు అనే తీగకు వేద రూప పుష్పములు పూయటం వలన, ఆ తీగె నుండి మంచి విద్యాగంధము వీస్తుందిట.
ఆ గంధము ప్రజలకు పుష్టిని, వృద్ధిని సమకూరుస్తుంది. ఇహపరముల నిస్తుంది.
అందుకే శివుణ్ణి ‘సుగంధి’ అని వేదము వర్ణించింది.
శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది.
"చంద్రమా మననో జాతః"
మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుని కళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి, చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది.
అలాగే... మనసుకు చేరిన 16 మాలిన్యములు (అనగా అష్టమదములు + అరిషడ్వర్గములు + మనస్సు + అహంకారం) ఒక్కటే శేషించి ఉంటుంది.
ఆ మాలిన్యాన్ని దూరం చేసేది శివపూజ 🙏 శివాభిషేకం, శివనామ సంకీర్తనం.
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
-- సత్య వాడపల్లి
Comments
Post a Comment