ఓం నమః శివాయ (త్రిపుటిజ్ఞానం)

 ఓం నమః శివాయ🙏


ఏకబిల్వం శివార్పణం


జ్ఞాన స్వరూపమయిన పరమాత్మ పరమశివుడు. 

మనలోని అజ్ఞానాన్ని (మందబుద్ధిని) రూపుమాపి, ‘జ్ఞానజ్యోతి’ ని వెలిగించి... మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, జ్ఞాన స్వరూపమైన మారేడుదళాలు స్వామికి సమర్పించుకుంటు ఉంటాము.


పూజకుడు – పూజ్యము – పూజ/

స్తోత్రము – స్తుత్యము – స్తుతి /

జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము 

ఇలా మూడు x మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానం. 


ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ, ఆధారకాండము ఒక్కటే అయినట్లు... 

సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలలో మూడుపత్రాలుగా వేరు వేరుగా వున్నట్లు గోచరిస్తున్నాడు. 

కానీ, ఆయన సర్వాంతర్యామి. 

  

“పూజకుడవు నీవే, పూజింపబడేది నీవే, పూజాక్రియవు నీవే” అనే భావంతో శివుని పూజించుటయే సరియైన పద్ధతి. 


ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకుని... బిల్వ పత్ర రూపంతో ‘త్రిపుటి జ్ఞానాన్ని’ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకుని ‘శివోహం, శివోహం’ అనే మహా వాక్య జ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది. 


శివార్చనలకు మూడురేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. 

ఒకసారి కోసిన బిల్వపత్రాలు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటాయి.

వాడిపోయినప్పటికీ దోషం ఉండదు.


బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. 

వాటిని స్పృశించటం వలన సర్వపాపాలు నశిస్తాయి.

ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించటం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతుంటాయి. 

 

ఏక బిల్వ పత్రంలోని మూడురేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనీ, కుడివైపుది విష్ణువు అనీ, మధ్యనున్నది శివుడు అనీ చెప్పబడుతోంది. 


ఇంకా బిల్వదళములోని ముందుభాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటంచేత, బిల్వపత్రంయొక్క ముందు భాగాన్ని శివునివైపు ఉంచి పూజించాలి. 

బిల్వవనం కాశీక్షేత్రంతో సరిసమానమైనది అని శాస్త్రవచనం. 

                   

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

                                                             -- సత్య వాడపల్లి               

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు