మాధవ మాసం... వైశాఖము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥మాధవ మాసం... వైశాఖము
వసంత ఋతువులో వచ్చే చైత్రమాసాన్ని ‘మధుమాసం’ అని, రెండవ మాసం అయిన వైశాఖాన్ని ‘మాధవ మాసం’ అని వైదిక సాంప్రదాయంలో అంటారు.
వైశాఖమాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకు అత్యంత విశిష్టమైనది. అన్ని మాసాల్లోకి వైశాఖమాసం ఉత్తమ మైనదని, ఎంతో పుణ్యప్రదమైన మాసమని, ఈ నెలలో చేయవలసిన అనేక వ్రతాలు, పూజలు, దానాలు గురించి పురాణాలు చెబుతున్నాయి.
అత్యంత పవిత్రంగా చెప్పబడుతున్న ఈ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే. అటువంటి ముప్ఫై పుణ్య దినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణాల్లో వివరించబడ్డాయి.
వైశాఖమాస మహత్మ్యాన్ని శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
కార్తికం, మాఘ మాసాలంతటి ప్రాశస్త్యంగల మాసం "వైశాఖం" అని వైశాఖ పురాణం చెబుతుంది.
కార్తిక పురాణం, మాఘ పురాణం ఏవిధంగా వున్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా "వ్యాసమహర్షి" రచించారు.
ఈనెలలో వచ్చే పౌర్ణమిరోజు విశాఖ నక్షత్రం వుండటం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది.
ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న మాసాల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం వుంది. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్నివిధాలా అనువైనది.
కార్తిక, మాఘ మాసాలలో తెల్లవారుజామున స్నానం చేసిన విధంగా ఈ నెలలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత:కాల స్నానం చేస్తే మంచిదని చెబుతారు.
స్నాన, పూజ, దానధర్మాలు వంటి వాటిని ఈ నెలలో ఆచరించడంవల్ల మాన వులకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం, సిద్ధిస్తాయని పురాణ కథనం.
వైశాఖమాసంలో నదీస్నానం ఉత్తమమైనదని, అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువల్లో గానీ, చెరువులో గాని, బావులవద్ద గాని అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలని, నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో పాడ్యమి నుంచి వైశాఖ బహుళ అమావాస్య వరకు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితో కలిపి తులసిదళాలతో పూజించడం ముక్తిదాయకమని చెబుతారు.
ఈ మాసంలో ఏక భుక్తం, నక్తం వుండటం ఉత్తమంగా చెప్పబడింది. యజ్ఞాలు, తపస్సులు, పూజాదికాలు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతిని చేకూరుస్తుందని చెబుతారు.
💥వైశాఖ శుద్ధ తదియ - అక్షయ తృతీయ
తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే.
💥వైశాఖ శుద్ధ తదియ - సింహాచల చందనోత్సవం
ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు.
💥వైశాఖ శుద్ధ తదియ - బలరామ జయంతి
ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు.
💥వైశాఖ శుద్ధ తదియ - పరశురామ జయంతి
తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు.
💥వైశాఖ శుద్ధ పంచమి - ఆది శంకరాచార్య జయంతి
పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ళను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది.
💥వైశాఖ శుద్ధ షష్టి - రామానుజ జయంతి
ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు.
💥వైశాఖ శుద్ధ సప్తమి - గంగావతరణం
తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు.
💥వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహినీ ఏకాదశి
ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం.
💥వైశాఖ శుద్ధ చతుర్దశి - శ్రీనృసింహజయంతి
తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు.హిరణ్యకశిపుడిని అంతమొందించడానికి శ్రీమహావిష్ణువు అవతరించినది ఈ దినమే. ఈ దినం ఉపవాసంను పాటించి స్వామివారిని పూజించడం లేదా స్వామివారి వ్రతం చేయడంతో పాటు స్వామివారు ఉద్బవించిన స్తంభం, ఇంటిగడపలను పూజిస్తారు.
💥వైశాఖ పూర్ణిమ - మహావైశాఖి
వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపంను శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు.అలాగే హిరణ్యకశిపుడిని అంతమొందించి ఉగ్రరూపంలో తిరుగుతూ ఉండిన నృసింహస్వామి ఉగ్రరూపాన్ని తొలగించేందుకు శివుడు శరభుడిగా అవతరించిన దినమూ ఇదే.
💥వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజు ఆంజనేయస్వామి వారిని సింధూర, తమలపాకులతో పూజించడంతో పాటూ వడమాలను ధరింపచేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించవలెను.
ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి.
వైశాఖమాసం నెలరోజులు విష్ణుసహస్రనామ పారాయణ చేయడం ప్రశస్తమని, అశ్వత్థ వృక్షానికి పుష్కలంగా నీరు పోసి ప్రదక్షిణలు చేయాలని, అలా చేయడం వలన అభీష్ట సిద్ధి లభిస్తుందని, పితృదేవతలు తృప్తి చెందుతారని చెబుతారు.
శివునికి ధారాపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుందని పురాణ కథనం.
వైశాఖమాసంలో మామిడిపండ్లు, గొడుగులు, విసనకర్రలు, పాదరక్షలు నీటి పాత్రలు, బట్టలు ఎవరికైనా దానం చేస్తే విశేష ఫలితాలనిస్తుంది.
దాహంతో వున్న వారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుందని చెబుతారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment