ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏


పార్వతీపరమేశ్వరులు ఒకరోజు ఎత్తైన ఋషిపర్వతం మీద విహరిస్తుండగా, అచ్చట ఉన్న ఎందరో మహర్షులు, యోగులు, ఋషులు వీరికి ప్రణమిల్లగా,  బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు అనే బాలుడు అహంబ్రహ్మస్మి స్థితిలో ఉండి, వీరిని ప్రత్యేకంగా గుర్తించక, కదలక ఆత్మస్థితిలో బ్రహ్మానందంలో ఉండడం చూసి, ఆహా! ఎంతటి గొప్ప స్థితి అని శివుడు పార్వతితో చెప్తూ, సనత్కుమారుని చెంత నిలిచి, ''ఏమయ్యా! జగత్తుకే మాతాపితురలం కదా, మమ్మల్ని పలకరించవేమిటి?" అని అడుగగా..


'అంతటా బ్రహ్మమే కనబడుతున్న నాకు మీరు వేరుగా తోస్తే కదా, పలకరించడానికి'... అని బదులిస్తాడు. "నీకో వరం ఇస్తాం, ఏమి కావాలో కోరుకో" అని శివుడు అనగా, 'వరం ఇవ్వడానికి నువ్వొక్కడివి, తీసుకోవడానికి నేనొకడిని అని ఉంటే కదా...ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకే వరమూ వద్ద'నెను.


శివుడు లోలోపల ఈయన అద్వైత జ్ఞానస్థితికి ముగ్ధుడౌతు, "అయితే శాపం ఇస్తాను" అని అనెను. 'వరమూ, శాపమూ అని రెండున్నాయా? వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖమూ అని రెండు లేనప్పుడు, నీవు ఏది ఇస్తే నాకేమిటి...సరే, శాపమిచ్చిన ఈ శరీరానికే గాని, నాకు కాదు కదా, ఇవ్వండ'నెను సనత్కుమారుడు. 


శివుడు ఆనందంతో, "ఏం జ్ఞానమయ్యా నీది. వరం వద్దంటావు, శాపాన్ని ఇస్తానంటే ఇమ్మంటావు" అని అంటుండగా, 'స్వామీ!  వరం అంటారు, శాపం అంటారు ఏమిటిదంతా... కావాలంటే నేనే మీకు వరం ఇస్తాను, ఏం కావాలో అడగండి' అంటాడు సనత్కుమారుడు.


దీనికి ఎంతో ముగ్ధుడైన శివుడు, "నాయనా! నీవు నాకు కుమారుడిగా జన్మించు. ఇదే నేను కోరుకునే వరం" అని అన్నాడు. అప్పుడు 'నీకు మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను' అని సనత్కుమారుడు అంటాడు.


ఈ మాటకి ప్రక్కనే ఉన్న పార్వతీదేవి "అదేమిటి నీకు మాత్రమే అని శివుడితో అంటున్నావు. నాకు కొడుకుగా పుట్టవా" అని అడుగుతుంది. 'అమ్మా! ఏమీ అనుకోకు, నీకు కొడుకుగా రావాలంటే, నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి. నేను యోనిసంభవుడుగా రానమ్మా. ఆ గర్భస్థ యాతన నాకొద్దు. నేను శివ కుమారుడుగానే పుడతాను...అంతే!' అన్నాడు సనత్కుమారుడు. 


"అదెలా సాధ్యమవుతుంది? మగవాడికి పుత్రుడు ఎలా  పుడతాడు? లోకంలో ప్రకృతి పురుషుడు లేకుండా జన్మించడం ఎలా కుదురుతుంది? ఆది దంపతులమైన మాకు నీవు పుత్రుడుగా పుట్టాల్సిందే"నని అమ్మ అనగా, 'అమ్మా! పార్వతీపరమేశ్వరులకు కొడుకును అవుతానేమో గానీ, నీ గర్భవాసం లేకుండా నీ కొడుకుగానే వస్తాను. నీ సంబంధంగా పుట్టి, నీ కొడుకుగా కీర్తింపబడతాను' అని సనత్కుమారుడు అంటాడు. ఆ మాటతో ఆదిదంపతులు ఆనందంగా అంతర్థానం అయిపోతారు.


ఆ పిమ్మట ఒకసారి బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారునికి తాను దేవసైన్యానికి అద్యక్షుడయినట్లు, కత్తి పట్టుకొని, రాక్షససంహారం చేస్తున్నట్లు కల వచ్చింది. అన్నింటికీ సాక్షిగా ఉండవలసిన నేను ఈ కలలో తాదాత్మ్యత పొందాను. ఉద్వేగాన్ని పొందాను. నాలో ద్వంద్వ భావం ఎలా వచ్చింది. తనకి కల రావడమేమిటని విచారణ చేస్తూ..


తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, 'నాకు కల రావడం ఏమిటీ? నేను దేవసైన్యములకు అధిపతిని అయినట్లు, రాక్షస సంహారం చేస్తున్నట్లు కల వచ్చింద'ని చెప్పగా, 


"నాయనా! క్రిందటి జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు, ఈ వేదాలనే కదా రాక్షసులు తస్కరించారు,  సముద్రంలో పడేసారు, ధిక్కరించారు, పరమాత్మను ఇబ్బందిపెట్టి అవతారాలు తీసుకునేలా చేశారని కోపగించుకుంటూ చదివావు. దేవాసుర యుద్ధ ఘట్టాలు చదివినప్పుడు విపరీతమైన భావోద్వేగాన్ని పొంది, నాకే గనుక దేవసేనాధిపతిగా అవకాశం వస్తే, కత్తిపట్టి, వాళ్ళ తలలు నరికేసి ఉండేవాడిని... అని బలంగా అనుకునేవాడివి. ఆ వాసనాబలం చేతనే ఈ కల వచ్చింది. ఈ వాసన పోవడానికి దేవసేనానిగా ఒకసారి నీవు పుట్టవలసిందే. అన్నీ తెలిసిన మహానుభావుడు శంకరుడు. అందుకే నీ వాసనాబలం క్షయం చేయడానికే, నీ చెంతకు వచ్చి, వరం తీసుకున్నాడు. లేకపోతే ఆయన నీకు వరం అడగడం ఏమిటి? నీవు ఆయనకు కుమారుడవై పుట్టబోతున్నావు.  దేవసైన్యమునకు అధ్యక్షత వహిస్తావు"... అని బ్రహ్మ తెలిపెను. 


ఇప్పుడు ఇక్కడ మనం కొంత పరిశీలన చేస్తే, శివుడుచే జరగాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 


మొదటిది : బ్రహ్మ ఇచ్చిన వరం వలన దేవతలను రక్షించడానికి తన వీర్యం నుండి తారాకాసురుడును సంహరించగలిగే కొడుకు రావాలి.


రెండవది: సనత్కుమారుడు వాసనాబలం పోగొట్టాలంటే, ఆ జ్ఞానిని కొడుకుగా కని, దేవసైన్యానికి అధిపతిని చేసి, అసురులను అంతమొందించాలి.


మూడవది : పార్వతీదేవి గర్భవాసం చేయనన్న బ్రహ్మజ్ఞాని సనత్కుమారుని మాట నిలబెట్టాలి.

ఈ మూడు విషయాలు అర్ధం చేసుకుంటే, ఈ మూడు నిజం చేయడానికే అన్నీ తెలిసిన శివయ్య ఒక ప్రణాళిక ప్రకారం శివమాయను దేవతలపై ప్రసరింపచేశాడనే పరమార్థమును గ్రహించగల్గుతాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు