💥చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది
యుగం అంటే రెండు లేదా జంట అని అర్ధం.
"ఉత్తరాయణం" "దక్షిణాయణం" అనబడే ”అయన” ద్వయమే యుగం. (పరోక్షంగా సంవత్సరం)
యుగానికి ఆది కాబట్టి ”యుగాది” అయింది. కాల క్రమంలో ”ఉగాది”గా మారింది.
బ్రహ్మ ఈ రోజునే సృష్టి మొత్తం చేసాడని పురాణాలు చెబుతున్నాయి.
పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు.
తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు.
అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారు
విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తులైనారని పెద్దలు చెబుతారు.
శాలివాహన శకానికి యుగకర్తగా నిలిచిన శాలివాహన చక్రవర్తి స్మృత్యర్థమే ఉగాది వచ్చింది అనేది చారిత్రక భావన.
ఉగాది కాలానికి సంకేతం.
'కాల’లో, ‘కా’ అనగా శుభములను, ‘ల’ అనగా అందించునది అని అర్థం.
‘‘అహమేవ అక్షయ కాలః’’ అనేది భగవద్వాక్యం. ‘‘అక్షయమైన కాలాన్ని నేనే’’ అని చెప్పాడు పరమాత్మ.
కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (ఋతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలనే సందేశాన్నిస్తుందీ పండుగ.
💥శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ!
సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం!
--అనే శ్లోకాన్ని చదువుకుని ఉగాది రోజు ఉదయమే ఉగాది పచ్చడి సేవించాలి.
వేపపువ్వు, చింతపండు, కొత్త బెల్లం, మామిడి ముక్కలు, చెరుకు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి చేస్తారు.
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో అన్నింటినీ సమర్ధతతో సమంగా స్వీకరించి, నిరాశ, నిస్పృహలను దరిచేర నివ్వకుండా, ఆశావహ దృక్పథంతో మంచిని (తీపిని) అందుకోవాలి అనే జీవన సందేశం ఉగాది పచ్చడి ప్రసాదంలో దాగున్నది.
ఆరోగ్య రీత్యా చూస్తే ఉగాది నుంచి ఎండలు ముదురుతాయి. ఆటలమ్మ పొంగు వగైరా వేడి సంబంధ కారక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
బెల్లం చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. వేపపువ్వు వాత, పిత్త, పైత్య వికార దోషాలను తొలగించి ఆరోగ్యం కలిగిస్తుందనేది వైద్య శాస్త్రం చెబుతున్న విషయమే.
ఉగాదికి సంబంధించిన ప్రమాణాలు ”నిర్ణయ సింధు”, ”ధర్మ సింధు”లలో ఉన్నాయి.
💥ఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణ కుంభ దానం), పంచాంగ శ్రవణం మున్నగు "పంచ కృత్య నిర్వహణ" కావించాలని వ్రత గ్రంథాలు చెప్పే విషయం.
పంచాంగ శ్రవణం వెనుక మరో విశేషమూ ఉంది. పంచాంగం వినటం సత్కర్మ. ఆయుష్షు వృద్ధి చెందుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. సిరి సంపదలు పెరుగుతాయి అని చెబుతారు పెద్దలు.
దుస్వప్న దోషాలు నశిస్తాయని, గంగా స్నాన పుణ్యమూ, గోదాన ఫలితమూ పంచాంగ శ్రవణం వలన కలుగుతుంది అని చెబుతారు.
ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర వైభవాన్ని, శని ఐశ్వర్యాన్ని, కుజుడు శుభాన్ని, రాహువు బాహు బలాన్ని, కేతువు కులాధిక్యతను యిస్తారని "సూర్య శౌర్య మదేందు ఇంద్ర పదవీం..." అనే శ్లోకం చెబుతోంది.
లక్ష్మీ ప్రాప్తికి, విజయ సాధనకు చైతన్యం కావాలి. కాలం జీవునికి చైతన్యం కలిగిస్తుంది. అందుకే ”తత్త్వైనమ:”, ”నిమేషాయ నమ:” ”కాలాయ నమ:” అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాం.
ఉగాది నాటి పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, కాల స్వరూప నామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ దేవీ పూజకు సదృశమైనదని, దేవీపూజ ఫలాన్ని ఇస్తుందని పెద్దల ఉవాచ.
ఉగాది సందర్భంగా కవి సమ్మేళనాలు జరుగుతాయి. కృష్ణదేవరాయల కాలంలో వసంతోత్సవాలు వైభవంగా జరిగేవి. కవులకు, గాయకులకు, నర్తకులకు సన్మానాలు ఘనంగా జరిగేవి.
వరాహ మిహురుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అని పెద్దల భావన.
సకల అనుభూతుల సమ్మేళనం జీవితం. స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడమే వివేకవంతుని లక్షణం. ఇదే ఉగాది సందేశం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment