గురు స్వరూపం.. హయగ్రీవుడు!

 ⚜️🕉️🚩ఓం హయగ్రీవాయ నమః🌹🙏


గురు స్వరూపం.. హయగ్రీవుడు!


భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం హయగ్రీవుడు.


జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  |

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||    

వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే

బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |

అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం

ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||


కాలానికి అందనివాడు. సృష్టికి ముందున్నవాడు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవుడిగా అవతరించాడు. తెల్లని రూపం వాడు, జ్ఞాన-అజ్ఞానాల్ని తేటతెల్లం చేసే చల్లని దేవుడు హయగ్రీవుడు.


శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు.


ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖం, మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామిది తెల్లటి శరీర ఛాయ. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.


పురాణాల్లో హయగ్రీవ అవతారానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళంలో దాచిపెడతారు. వేదాలు లేనిదే సృష్టికార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు. వెంటనే, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి, మధుకైటభులను వధించి, వేదాలను రక్షించి, బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.


హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి. స్వామి రూపం సకల విద్యలకు నిలయంగా భాసిస్తుంది. అంతేకాదు, హయగ్రీవుడు సకల దేవతాస్వరూపం కూడా. ఆయనవల్లనే ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. సాక్షాత్తు హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి శక్తి ఉపాసనా రహస్యాలను బోధించినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది.


అంతేకాదు, సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవస్వామిని అర్చించిన ఎందరో ఋషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు.


సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజాస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించాడు. దుష్టమంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసనతో వేద పారంగతుడు అయ్యాడని మహాభారతం చెబుతున్నది. సూర్యుడు సహా దేవతలందరూ హయగ్రీవుడి ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్‌ చెబుతున్నది.


హయగ్రీవుడి రూపం విచిత్రంగా ఉంటుంది. గుర్రం ముఖం చైతన్యానికి ప్రతీక. గుర్రం సకలింపు నుంచి బీజాక్షరాలు ఉద్భవించాయని అంటారు. శుద్ధ స్పటిక రూపం ఆయనది. నిర్మలత్వానికి చిహ్నం ఇది. రెండు చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు. మరో చేతిలో పుస్తకం ఉంటుంది. ఇంకో చేతిని చిన్ముద్రతో చూపుతూ భక్తులను అనుగ్రహిస్తుంటాడీ దేవుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు. ఆయన్ను గురువుగా భావించి ఉపాసిస్తే.. సద్బుద్ధి కలుగుతుంది. సత్వ గుణం వికసిస్తుంది. విద్యాప్రాప్తి కలుగుతుంది. సకల దేవతా మంత్రాలు ఆధీనంలోకి వస్తాయని చెబుతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు