💥ఉగ్రనారసింహుని అవతారతత్త్వం!

 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏


💥ఉగ్రనారసింహుని అవతారతత్త్వం!


రామకృష్ణాది అవతారముల వలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారము శ్రీ నరసింహ అవతారం.


నారసింహుని పూజలతో, అకాల మృత్యు భయముండదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయాచరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం.


ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం!

నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం!!


💥పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవమూకాని చేతిగోళ్ళతో, హరణ్య కశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నమైనది.


భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారం నారసింహావతారం. సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపు దాల్చ డం ఈ అవతార ప్రత్యేకత.


దుష్టశిక్షణ శిష్ట రక్షణ, సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం... నమ్మినబంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృవధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు. 


వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభ దినే,

సంధ్యాకాలే నిశాయుక్తే స్తంభోద్భూతం నృకే సరి:


వైశాఖ శుక్లపక్ష చతుర్దశి స్వాతి నక్షత్ర ప్రదోష కాలంలో నరసింహుడు అవతరించాడు.


💥విష్ణుసేవా తత్పరులైన జయ విజయులు వైకుంఠంలో ద్వారపాల కులు. ఒకసారి సనక సనందాది మహా మునులు వికుంఠుని దర్శనార్ధం వెళ్ళగా, అది తగిన సమయం కాదని, జయవిజయులు అడ్డగించగా, మునులు కోపించి వారిని విష్ణు లోకానికి దూరం కాగలరని శపించారు. 


అప్పుడు వారు విష్ణువు శరణు వేడగా, మునుల శాపానికి తిరుగు లేదని చెప్పారు. కాని వారిలోని భక్తిని తెలిసిన మహావిష్ణువు వారికి ఒక ఉపాయాన్ని చెప్పారు.


అదేమిటంటే భక్తులుగా 7 జన్మ లు, లేదా విరోధులుగా 3 జన్మలు భూలోకాన ఉంటే మునులు ఇచ్చిన శాపాన్ని అనుభవించినట్లు అవుతుంది.

అటు ముని జనానికి వచ్చిన కోపం ఉపశమిస్తుం ది. ఇటు మీరు కోరుకున్నట్టు తిరిగి నా దగ్గరకు వచ్చే మార్గం మీకు సులువు అవుతుందని చెప్పాడు.


జయ విజయులు ఏడు జన్మలు తమను విడిచి దూరంగా ఉండలేమని వైరంతోనే 3 జన్మలు ఎత్తి త్వరగా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది.. కనుక ఈ మూడు జన్మలే మాకు అంగీకారమని చెప్పారు. 


వారే కృతయుగంలో హరణ్యాక్ష హరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు.


💥రాక్షసరాజు హరణ్యకశిపుడు తపస్సుకై వెళ్ళగా, ఆయన భార్య లీలాదేవి గర్భవతిగా ఉండగా, ఇంద్రుడు రాక్షస సంహారాన్ని ప్రారంభించి, చివరకు లీలావతిని అపహరించుకొని పోబోతుండగా, నారదుడు మందలించి, తన ఆశ్రమానికి తీసుకెళ్ళి, భాగవత తత్వబోధ చేయగా, గర్భస్థుడైన ప్రహ్లాదుడు విన్నాడు.


తపస్సుచే బ్రహ్మను మెప్పించిన హరణ్యకశిపుడు తనకు నరులచేగాని, మృగాలచేగాని, పగలు గాని, రాత్రి గాని, ప్రాణమున్న వానిచే గాని, ప్రాణము లేని వానిచే గాని, ఆయుధము చేత గాని, గాలిలో గాని, నీటిలోగాని, అగ్నియందు గాని, ఆకాశంలో గాని, భువిపైన గాని, దేవదానవులచే గాని, ఇంటగాని, బయట గాని మరణము లేకుండా వరాలు కోరి, పొందాడు.


హరణ్య కశిపుడు వరగర్వ మదాంధుడై, విష్ణుద్వేషి యై, దేవతలను జయించి, ఇంద్ర సింహాసనం ఆక్రమించి, తాపసులను వారి తపస్సులను భంగ పరిచి, సాధువులను హంసించి, పంచభూతాలను శాసించాడు.


పుట్టిన బిడ్డకు ‘ప్రహ్లాదుడు’ అని నామకరణం చేశాడు.

విష్ణుభక్తుడైన కుమారుని మార్చడానికి శతవిధాలా ప్రయత్నించాడు. 


"చద వని వాడజ్ఞుండగు, చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ” అంటూ రాక్షస కుల గురువైన చండామార్కులకు కుమారుని అప్పగించాడు. 


హరణ్యకశిపుడు, గురు కులంలో నీవు ఏమి నేర్చుకున్నావని ప్రశ్నిస్తే... ప్రహ్లాదుడు, "సర్వమూ అతని దివ్యకళామయము అని తలంచి, విష్ణువునందు హృదయము లగ్నము చేయుట మేలు” అని బదులిచ్చాడు.


రాక్షసులకు తగని ఇలాంటి బుద్ధి నీకెలా పుట్టిందంటే "మాందార మకరంద మాధుర్యమున దేలు, మధుపంబు వోవునే మదనములకు” అంటూ భక్తి సహజంగానే సంభవించిందన్నాడు.


మళ్ళీ గురుకులానికి పంపబడి, మనసు మారిందేమోనని గురువు లేమి చెప్పిరని ప్రశ్నిస్తే, "చదివించిరి నను గురువులు... చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అని వివరించాడు. 


💥తుదకు విసిగిపోయి విష్ణువు ఎక్కడ ఉన్నాడురా అని ప్రశ్నించాడు.


కలడంబోధి , గలండు గాలి, గలడాకాశంబునం ,గుంభినిం

గల , డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం

గల ,డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం

గల , డీశుండు గలండు , తండ్రి! వెదుకంగా నేల నీ యా యెడన్


ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే అంటూ ప్రహ్లాదుడు బదులిచ్చాడు.


అయితే "స్తంభమునను చూపగలవె చక్రిన్‌" అని ప్రశ్నిం చగా, "కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్‌” అన్నాడా పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు. 


వెంటనే హిరణ్య కశిపుడు స్థంభాన్ని చరవగా, శ్రీ నృసింహుడు ఆవిర్భవించి, హిరణ్యకశిపుని ఒడిసి పట్టి, వజ్రాల వంటి, ప్రాణం ఉన్నవీ లేనివీ అయిన, తన నఖాలతో (గోళ్ళు) చీల్చి, శ్రీహరి (మనిషి జంతువు కాని) నరసింహ రూపంలో, పగలూ రాత్రిగాని సంధ్యా సమయంలో, ఇంటా బయటాగాని గుమ్మంలో, భూమ్యాకాశాలు కాని తన తొడపై, సంహరించాడు.


ఇలా ప్రహ్లాదుని మాటను యధార్ధం చేసి, బ్రహ్మవరాన్ని గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు శ్రీ మహావిష్ణువు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం