శివుడు - హాలాహల భక్షణం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

💥 హర హర మహాదేవ శంభో శంకర 💥


💥శివుడు - హాలాహల భక్షణం💥


కొందరు కలడందురు నినున్

కొందరు లేదండు రతడు గుణిగాడనుచున్

కొందరు కలడని లేడని

కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా!


మూడుమూర్తులకును మూడులోకములకు

మూడుకాలములకు మూలమగుచు

భేదామగుచు దుదినభేదమై యొప్పారు

బ్రహ్మ మనః నీవ ఫాలనయన! 


సదసత్తత్త్వచరాచర

సదనంబగు నిన్ను బొగడ జలజభవాదుల్

పెదవులు గదలుప వెరతురు

వదలక నిను బొగడ నెంతవారము దేవా! 


నీకంటె నొండెరుగము

నీకంటెం బరులు గావనేరరు జగముల్

నీకంటె నొడయడెవ్వడు

లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా!


💥భావం:

దేవ దేవా! నీవే మాకు శరణ్యము.

కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు సాకారుడవై లేవని అంటారు, మరి కొందరు నీవు కలవో లేవో అని తికమక పడతారు.

నీయొక్క నిజతత్వము ఎవ్వరికి తెలియదు కదా 

పరమశివా!


ఓ త్రినేత్రా! త్రిమూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై ఉంటూ బాహ్యమైన భేదాలు కనిపించినను, నిజానికి ఏకైక పరబ్రహ్మ అభేద తత్త్వమై నీవు ఉన్నావు.


సత్యము, అసత్యములతో కూడియున్న ఈ చరాచర సృష్టికి ఆశ్రయమై యున్న నిన్ను పొగడుటకు బ్రహ్మాది దేవతలు కూడా పెదవులను కదుపుటకు సాహసింపలేరు.

ఇక మేమెంత?


ఓ సర్వలోక పూజ్యా! మేము నిన్ను తప్ప ఇంకెవరినీ ఎరుగము.

నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకములను ఈ హాలాహలాన్నుండి కాపాడలేరు.

ఈలోకములన్నిటా నీకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు.


-అని దేవతలు  శివుని హాలహలము నుండి రక్షించమని స్తుతించారు.


💥అప్పుడు శివుడు ప్రసన్నుడై, వారిపై జాలి కలిగి, పార్వతితో ఇలా అన్నాడు.


ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన

ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్

ప్రాణులకిత్తురు సాధులు

ప్రాణంబులు నిమిషభంగురములని మగువా!


పరహితము సేయునెవ్వడు

పరమహితుండగును భూతపంచకమునకున్

పరహితమె పరమధర్మము

పరహితునకు నెదురులేదు సర్వేందుముఖీ!


హరి మది నానందించిన

హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్

హరియును జగములు మెచ్చగ

గరళము వారింపుటొప్పు కమలదళాక్షీ!


💥భావం:

ఓ పార్వతీ! ప్రాణములను రక్షించుకొను కోరికతో వచ్చి, శరణు జొచ్చిన ప్రాణులను ప్రభువులందరూ రక్షింపవలెను. సాధువులు, మహాత్ములు ఇతరులకు తమ ప్రాణములను, అవి క్షణంలో పోగలవని తెలిసి ఇచ్చెదరు కదా!


ఇతరులకు ఉపకారము చేసే వాడు పంచభూతములకు, సమస్త జీవరాశికి పరమ హితుడగును. పరోపకారమే పరమ ధర్మము. ఇతరుల మంచి కోరేవాడికి ఎందులోనూ ఎదురులేదు కదా.


ఇతరులకు మంచి చేస్తే ఆ విష్ణువు కూడా సంతోషించును. విష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరిని, సర్వ లోకములను ఆనందింప చేయటానికి విషాన్ని నివారించటం మంచిదికదా!


💥అప్పుడు ఆ లోకమాత అయిన పార్వతి ఎలా ఆ శంకరుడు హాలాహలాన్ని తన కంఠంలో ఉంచుకోటానికి ఒప్పుకుందో పోతన గారు ఇలా వర్ణించారు.


మ్రింగెడివాడు విభుండని

మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్

మ్రింగుమనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!


💥భావం:

మూడు లోకాలను దహించనున్న హాలాహాల జ్వాలలను తానే స్వీకరించ దలుచుకున్న శివునకు శివాని లోక కల్యాణార్థమై అనుమతి ఇచ్చింది.  


మింగ వలసినది ఘోరమైన విషమని తెలిసి, మింగేవాడు తన పతి దేవుడైనా,  జీవరాసులను రక్షించవలసి ఉన్నందున సర్వమంగళయైన ఆ పార్వతి, గరళమును మింగుమని పతి దేవునికి అనుమతినిచ్చెను.

మరి ఆ సర్వలోక జనని తన మాంగల్య బలమును ఎంతగా నమ్మినదో కదా!


తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్

ఘన గంభీరరవంబుతో శివుడు లోకద్రోహి! హుం! పోకు ర

మ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం

బన సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్


ఉదరము లోకంబులకును

సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్

గుదురుకొన గంఠ బిలమున

బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్


హరుడు గళమునందు హాలాహలము వెట్ట

గప్పుగలిగి తొడవుకరణినొప్పె

సాధురక్షణంబు సజ్జనునకు నెన్న

భూషణంబు గాదె భూవరేంద్ర!


💥భావం:

తన చుట్టూ దేవతా సమూహములు జయ జయ ధ్వనులతో కేకలు వేస్తుండగా, గంభీర స్వరముతో ఆ విషమేఘమును ఆజ్ఞాపించుచు, 'ఓ లోకద్రోహీ! ఎక్కడికీ పోకుండా నా దగ్గరకు రమ్ము' అని చెప్పి చెయ్యి చాచి ఆ మహావిషాన్ని అంతటా ఒకచోట చేర్చి ఒక్క ముద్దగా నేరేడు పండు లాగ విలాసముగా ఆరగించాడు.


తన పొట్ట లోకములన్నిటికి నిలయమని తెలిసియున్న మహేశ్వరుడు చెదిరి ఉన్న విషాగ్నిని ఒకచోట కుదురుకునేలా కంఠంలో పదిలముగా, చిన్న ఫలరసమా అన్నట్లు నిలుపుకొన్నాడు.


ఆ కంఠంలో విషము నలుపు పట్టిన ఆభరణంలా అలరారింది. సాధురక్షణ కూడా సజ్జనునకు ఒక ఆభరణమే కదా!


గరళంబు గంఠబిలమున

హరుడు ధరించుటకు మెచ్చి యౌనౌ ననుచున్

హరియు విరించియు నుమయున్

సురనాథుడు బొగడిరంత సుస్థిరమతితోన్


💥భావం:

శివుడు గొంతుకలో గరళము ఉంచుకోవటం చూసి భళిభళి అంటూ శ్రీహరి, బ్రహ్మ, పార్వతి, ఇంద్రుడు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.


💥అలా ఆ పరమశివుడు నీలకంఠుడై ప్రపంచాన్ని ఆ విషాగ్ని నుంచి కాపాడాడు.


[దేవతలు, రాక్షసులు పాల కడలిని అమృతం కోసం చిలకటంలో భాగంగా సాగర మథనంలో అమృతం కన్నా ముందు కాలకూట విషం బయట పడింది.

ఈ కథను శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన మనోజ్ఞంగా వర్ణించాడు.

అష్టమ స్కంధములో వీటి వివరాలు ఉన్నాయి]


సేకరణ... అక్కిరాజు ప్రసాద్ గారి రచనా వ్యాసములు నుండి 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments