అష్టాదశ పీఠాలు - అనంత కోటి ఫలదాయకాలు
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
💥కాలం ఈశ్వర స్వరూపం.
ఈశ్వరుడు "అర్థనారీశ్వరుడు" అయినట్టుగానే కాలం పగటిని పరమేశ్వర స్వరూపంగాను,
రాత్రిని శక్తి అంటే పరమేశ్వరీ రూపంగా భావిస్తాం.
💥శక్తిస్వరూపిణి అయిన పరమేశ్వరిని వివిధ రూపాలలో పూజిస్తుంటాం.
ఆ తల్లి సృష్టి స్థితి లయాదులకు కారణం కనుక ఆ తల్లి చల్లనిచూపు మనపై ప్రసరించాలనే కోరికతో తల్లిని కొలవడం అనాదిగా వస్తోంది.
అసలు ఈ తల్లి వివిధ రూపాలలో రావడానికి ఓ పురాణ కథ ఉంది.
💥సృష్టికర్త సృష్టించిన ప్రజాపతులలో మోహంధకారంలో కూరుకుపోయిన "దక్షప్రజాపతి" తన కూతురు, అల్లుడైన పార్వతీపరమేశ్వరులను పిలవకుండా తాను నిశ్చయించుకొన్న యజ్ఞారంభం చేశాడు.
అన్నీ తెలిసిన పరమేశ్వరుడు శాంత చిత్తంతో తపస్సులో మునిగినా స్త్రీ అతి సున్నితమైన మనస్సు, చంచలమైన బుద్ధితో, మాతృరాధనలో మక్కువ కలిగిన పరమేశ్వరి దక్షుని యజ్ఞానికి వెళ్లింది.
అక్కడ అనుకోని అవమానాలను ఎదుర్కొంది.
అర్థనారీశ్వరి అయిన అమ్మ తన సగ భాగాన్ని అవమానించడం భరించలేక ఆ యజ్ఞగుండంలోనే ఆత్మాహుతి చేసుకొంది.
విషయం తెలుసుకొన్న పరమేశ్వరుడు రుద్రుడయ్యాడు. వీరభద్రుని పంపించాడు.
యజ్ఞం ధ్వసం జరిగింది.
దక్షుడు తలలేని వానిగా మిగిలాడు.
ఆహుతి అయిన తన సతీ శరీరాన్ని పరమేశ్వరుడే చేతులతో ఎత్తుకొని బయలుదేరాడు.
అలా బయలుదేరిన పరమేశ్వరుని చేతులలోని సతీ శరీరంలోని అవయాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రదేశంలో లోక కల్యాణం కోసం జారాయి.
అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా రూపొందాయి.
ఆ తల్లి ఆ శక్తి పీఠాలలో ఒక్కొక్క పేరుతో ప్రసిద్ధురాలైంది.
అలా ఏర్పడిన శక్తి పీఠాలు 108గా పరిఢవిల్లాయి. వాటిల్లో పదునెనిమిది పీఠాలు మిక్కిలి ప్రఖ్యాతి గాంచాయి.
అవే "అష్టాదశ పీఠాలు"గా వెలుగొందుతున్నాయి.
💥అష్టాదశ పీఠాలు - అనంత కోటి ఫలదాయకాలు
💥అష్టాదశ పీఠాలలో అమ్మ - శాకంబరీ, కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి, జోగులాంబ, భ్రమరాంబికా, మహాలక్ష్మి, ఏకవీర, మహాకాళీ, పురాహూతికా, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూప, మాధవేశ్వరి, వైష్ణవీదేవి, మంగళగౌరి, విశాలక్ష్మి, సరస్వతి అనే పేర్లతో అలరారుతోంది.
💥ప్రార్థనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్.
1) శాకంబరీ:
శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో గల ట్రింకోమలైలో కొలువైన ఈ తల్లి శాంకబరీగా నీరాజనాలందుకొంటోంది. పార్వతీదేవి "కాలిగజ్జెలు" ఇచ్చట పడుటవలన ఈ ప్రాంతానికి ఈ విశిష్టత లభించింది.
2) కామాక్షి:
మోక్షపురాలల్లో ఒకటైన కంచిలో శక్తి స్వరూపిణి కామాక్షీదేవిగా దర్శనమిస్తోంది.
"నగరేషు కంచి" గా మహాకవుల చేత పొగడబడింది. విష్ణుకంచి, శివకంచిగా ఉన్న ఈ కాంచీపురంలో శివకంచిలో అమ్మ కామాక్షి చతుర్భుజిగా కొలువుదీరింది.
శివోపదేశంతో ఇక్కడ అమ్మవారు తపస్సు చేసి ఏక్రామేశ్వరుణ్ణి కోరి వివాహం చేసుకొంది.
భక్తుల కోరిక మేరకు ఏక్రామేశ్వరుడు, కామాక్షి దేవి ఇద్దరూ కంచిలో కొలువై భక్తుల పాలిట కల్పవృక్షమై కాపాడుతున్నారు.
3) శృంఖలాదేవి:
ఈ దేవి ప్రద్యుమ్నంలో కొలువుదీరింది. ఈప్రద్యుమ్ననాన్ని గుర్తించటంలో భేదాభిప్రాయాలున్నా పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో ఉన్న అమ్మవారే శృంఖాలాదేవిగా చాలామంది భావిస్తారు.
ఈ తల్లి పురిటి బిడ్డలను చల్లగా కాపాడుతుంది.
పైగా తల్లి నడికట్టుతో దర్శనమిస్తుంది కనుకనే ఈ తల్లి బిడ్డల సౌభాగ్యానికి పేరుపెట్టిన దేవిగా జనులు ఆరాధిస్తారు.
ఈ తల్లిని ఒకసారి తన శాప విమోచనం కోసం ఋష్యశృంగుడు ప్రతిష్టించాడని ఐతిహ్యం.
శృంగమహర్షి ప్రతిష్టించిన దేవి కనుకనే శృంఖలా అన్న నామమేర్పడిందని ఓ కథనం ప్రచారం లో ఉంది.
మానవులకు ఉన్న ఈతిబాధలనే సంకెళ్లను త్రెంచి వేసి ఈ తల్లి కాపాడుతున్న దేవిగా భక్తులు ఆరాధిస్తుంటారు.
4) చాముండేశ్వరి:
కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకు ఒక కిలోమీటరు దూరంలో చాముండేశ్వరి కొలువుదీరింది. మహిషాసురుణ్ణి సంహరించిన ఈ తల్లిని దేవమానవులందరు కొనియాడుతూ మానవులను ఎల్లవేళలా కాపాడడానికి ఇక్కడ కొలువుదీరమని ప్రార్థించగా ఈ తల్లి ఇక్కడ నెలకొంది.
ఇక్కడ సతీదేవి వెంట్రుకలు పడిన స్థానంగా కూడా పరిగణిస్తారు భక్తులు.
5) జోగులాంబ:
మహాబూబ్ నగర్ లోని అలంపురం జిల్లాలో కొలువైన ఈ తల్లి గురించి అనేక స్థలపురాణాలు ప్రచారంలో ఉన్నాయి.
పూర్వకాలంలో పుణ్యవతి అనే కన్య కాశీ విశ్వనాథుడిని మెప్పించి పుత్రరత్నాన్ని పొందింది.
ఆ పుత్రుడు మరలా శివుని మెప్పించి శివుని వరాన్ని పొంది ఈ అలంపురంలో తపస్సు ఆచరించగా సృష్టికి ముందే ఇక్కడ పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసిన బ్రహ్మ ఓ సిద్ధరసం ఇవ్వగా ఆ యువకుడు ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలను నిర్మించాడు.
జోగులాంబ దేవతను తన తపస్సుతో మెప్పించి ఆ యువకుడే ఇక్కడ అమ్మ అనుగ్రహంతో జోగులాంబను ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణాలుచెబుతున్నాయి.
ఈ తల్లి కూడా చతుర్భుజియై తన భక్తులను కాపాడుతోంది.
6) భ్రమరాంబాదేవి:
శ్రీ పర్వతం, శ్రీనగం, సిరిగిరి, శ్రీగిరి అనే పేర్లతోఖ్యాతి గడించిన శ్రీశైలంలో చుట్టూ నాలుగు గోపురాలతో, కోటగోడల్లాంటి ఎత్తయిన ప్రాకారాలతో సుమారు 2,79, 300 చదరపు అడుగుల విశాలమైన ప్రాంగణంలో మల్లికార్జునితో కలసి శక్తి స్వరూపిణి భ్రమరాంబికగా కొలువుదీరింది.
ఈ అమ్మవారి గురించిన అనేక స్థలపురాణాలు ఆసక్తిదాయకాలు గా కనిపిస్తాయి.
అమ్మ అరుణాసుర సంహారానంతరం మల్లికార్జునితో కలసి కొలువుదీరిందని పురాణ కథనం ఇక్కడ విశేషంగా చెప్తారు.
ఈ మల్లికార్జున భ్రమరాంబలను కొలిచినవారికి పునర్జన్మ ఉండదు.
7) మహాలక్ష్మిదేవి:
కరవీరంగా ప్రసిద్ధిపొందిన కొల్హాపురిలో కొలువు దీరిన తల్లే మహాలక్ష్మి దేవి.
కొల్హుడన్న రాక్షసుడు తన వరగర్వంతో మితిమీరి ప్రవర్తిస్తున్నందున మహిషాసురుణ్ణి చంపిన తల్లి కొల్హుని తో పోరాడి ఈ అసురుడిని సంహరించింది. కాని ఆ అసురుడి చివరి కోరికను తీరుస్తూ ఆ తల్లీ ఇక్కడే కొలువైంది.
ఈ నగరానికి కొల్హాపురి నామధేయానికి కారకురాలైంది.
ఐదు గోపురాలతో ఉన్న ఈ మహాలక్ష్మి ఆలయం చూపరులకు ఆనందాన్నీ ఆముష్మిక సంపదను ఇస్తుంది.
8) ఏకవీర్యకా దేవి:
మహారాష్టల్రోని అహ్మద్ నగర్ కు సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ మూహూర్యం అనే క్షేత్రం నెలకొంది.
ఈ క్షేత్రంలోని దేవి సతీ శరీరంలోని కుడిస్తనంగా చెప్తారు.
ఈతల్లిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలతో పాటుగా శక్తిసంపన్నతలు, విద్యాబుద్దులు కూడా ప్రాప్తిస్తాయి.
9) మహాకాళి:
ప్రపంచ ఖ్యాతి గడించిన ఉజ్జయిని లో సతీదేవి శరీరాంగమైన మోచేయి ఇక్కడ పడింది.
ఈ క్షేత్రంలోనే త్రిపురాసురుణ్ణి సంహరించిన పరమశివుడు దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగంగా రూపొందుకొనగా అమ్మవారు మహాకాళిగా ఇక్కడ కొలువైందనే గాథ ప్రచారంలోంది.
వేదప్రియుడను శివభక్తుడిని దూషణుడను అసురుడి నుంచి కాపాడడానికి పరమశివుడు మహాకాళేశ్వరుడుగా అవతరించాడు.
ఆ వేదప్రియుడే శ్రీచక్రోపాసన చేసి అమ్మవారిని మహాకాళిగా దర్శనం చేసుకొన్నాడు. వేదప్రియునితోపాటుగా దేవ మానవ కోరిన ప్రకారం ఇక్కడే మహాకాళేశ్వరుడు, మహాకాళి ఈ ఉజ్జయినిలో కొలువై పూజలందుకుంటున్నారు.
10) పురుహూతికాదేవి:
ఇంద్రుని పూజలందుకొన్న పార్వతీ దేవే పురుహూతికాదేవిగా ఈ ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో ప్రతిష్టితమైంది. వ్యాసమహర్షి ఈ పురాహుతికా దేవిని, కుక్కుటేశ్వర స్వామిని కోరి కొలిచినట్లు పురాణ కథనం.
11) గిరిజాదేవి:
ఒరిస్సాలోని కటక్ పట్టణానికి సుమారు104 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాజాపూర్ టౌన్ లో ఈ "ఓడాణ్యం" అనే క్షేత్రం ఉంది.
ఇక్కడ పూర్వం చతుర్ముఖుడైన బ్రహ్మ మహావిష్ణువును స్మరిస్తూ యజ్ఞం చేయగా హోమగుండంనుంచి ఏడుగురు కన్యలు ఆవిర్భవించారు.
అందులో గిరిజాదేవి అనే బాలిక బ్రహ్మను ఏమి వరం కావాలో కోరుకొమ్మనగా విధాత నీవు ఇక్కడే కొలువై జనులందరినీ చల్లగా చూడాలని వరం అడిగాడు.
బ్రహ్మకోరిక తీర్చడానికి ఆ తల్లి గిరిజాదేవిగా ఇక్కడ అవతరించిందని స్థలపురాణం చెప్తోంది.
ఇక్కడ సతీదేవి నాభిపడిన స్థలంగా కూడా భక్తులు భావిస్తారు.
12) మాణిక్యాంబాదేవి:
సతీదేవి కణితి పడిన ప్రదేశమే ద్రాక్షారామం.
ఇక్కడ భీమేశ్వరునితోపాటుగా మాణిక్యాంబా దేవి కొలువైంది.
కాశి విశ్వనాథుణ్ణి వదిలిన దుఃఖభారాన్ని వ్యాసుడు ఈ భీమేశ్వర మాణిక్యాంబలను కొలిచి పోగొట్టుకొన్నట్టు చెప్తారు.
ఈ మాణిక్యాంబదేవిని కొలిచినవారికి తీరని కోరికలు ఏవీ ఉండవు.
ఈక్షేత్రమే దక్షిణ కాశిగా ప్రఖ్యాతి వహించింది.
13) కామరూపాదేవి:
అస్సాం లోని గౌహతి నగరానికి సుమారు 7కిలోమీటర్ల దూరంలో ఈ కామరూపాదేవి ఆలయం ఉంది. ఈ దేవినే "కామాఖ్య" అనీ పిలుస్తారు.
ఈ అమ్మవారు కోరిక కోర్కెలను ఈడేర్చటంలో ముందుండే తల్లిగా ప్రఖ్యాతి వహించింది .
14) మాధవేశ్వరి:
సతీ చేతివ్రేళ్లు పడిన స్థలంగా చెప్తారు.
ప్రయాగ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు.
15) వైష్ణవీదేవి:
కాశ్మీరులోని జమ్మునుంచి సుమారు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న త్రికూట పర్వతం పైన ఈ వైష్ణవీదేవి ఆలయం ఉంది.
ఈ వైష్ణవీదేవి త్రేతాయుగం నాటి శ్రీరాముడు ద్వాపరయుగంనాటి శ్రీకృష్ణార్జునులు కూడా పూజించారనే ఐతిహ్యం ఉంది.
16) మాంగల్యగౌరీదేవి:
పవిత్రక్షేత్రాలుగా ప్రసిద్ధి వహించిన వాటిలో గయ చాలా విశేషమైంది. సర్వమంగళాలను ప్రసాదించే పార్వతీదేవి ఇక్కడ మాంగల్య గౌరిగా దర్శనమిస్తుంది.
ఇక్కడ ఈ క్షేత్రంలో సతీదేవి వక్షోజాలు పడిన కారణంగా ఈ గౌరీదేవి ప్రతిష్టితమైనట్టుగా చెప్తారు.
17) విశాలాక్షి:
కాశీఅన్న పేరు స్మరించినంత మాత్రానే ముక్తిని ప్రసాదించే విశ్వనాథునితో కొలువైన తల్లే విశాలాక్షి.
ఈ తల్లినే శివుని కోపాగ్ని లోంచి వ్యాసుని కాపాడింది.
ఈ తల్లినే వ్యాసుని క్షుద్బాధనూ పోగొట్టింది.
కనుక ఈ తల్లిని పూజించిన వారికి ఈలోకంలోనే కాక పరలోకసంపదలు కూడా ప్రాప్తిస్తాయి.
అంతే కాక శివసాయుజ్యం లభిస్తుంది.
18) సరస్వతీ:
ముగ్గురమ్మల శక్తినే శ్రేష్ఠమైన పరాశక్తి అని చెప్పడానికి వీలుగా కొల్హాపూర్‌లో మహాలక్ష్మిదేవిగాను,
కాశ్మీరులో మహాసరస్వతీ దేవిగాను కొలువైంది శక్తి స్వరూపిణి.
ఈ తల్లిని ఆరాధించిన వారు విద్యాసంపన్నులు అవుతారు.
శ్రీనగర్‌కు సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఈ తల్లిని కీర్ భవానిగా కూడా ఇక్కడి వారు పిలుస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment