💥ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి.. శ్రీలక్ష్మీజయంతి.
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
💥ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి.. శ్రీలక్ష్మీజయంతి.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం
త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
పురాణాల ప్రకారం, శ్రీ లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించింది.
లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ.
3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ,
4. తామస మన్వంతరంలో - భూమి నుండీ,
5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ,
6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ,
7. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది.
ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో -
భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించెను.
ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కల్సి తపస్సు చేయుచుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. ఇది విన్న భృగుమహర్షి కుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా, అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన.
ఇక చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో -
పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేయగా, ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై - 'నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక' అని శపించెను.
శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా, దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యము కాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.
💥క్షీరసాగరమధనం:- మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు "శ్రీ మహావిష్ణువు"
క్షీరసాగర మధనం జరిగినప్పుడు - ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై 'శివుడు' స్వీకరించి 'నీలకంఠుడు' కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి 'సర్వమంగళ' గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం "శివరాత్రి" అయింది. ఇదియే కాక, ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది.
ఆ తర్వాత మరల కొనసాగిన సముద్రమధనంలో 'సురభి' అనే కామధేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత 'ఉఛ్వైశ్రవం' అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు.
అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో వున్న పాల్గుణశుద్ధ పూర్ణిమ. మనం జీవిస్తున్నకాలం వైవస్వతమన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ధి నుండి ఆవిర్భవించిన ఈ దినమునే ''లక్ష్మీజయంతి"గా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం.
ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగిన దినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకల సద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది ఆ శుభసమయమునే!
శ్రీ లక్ష్మీ జయంతి రోజు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేయాలి. ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్నచోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజామందిరంలో శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో, గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం గంధం, కుంకుమలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి. గులాబీలు, తామరపూలు, మారేడు దళాలతో పూజిస్తూ శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. చివరగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి.
🌹🌹ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🌹🌹
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment