💥గంగావతరణం💥

 ⚜️🕉️🚩ఓం శ్రీ గంగా దేవ్యై నమః🌹🙏


💥జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమి.. ‘దశ పాపహర దశమి’ గంగావతరణం


💥గంగావతరణం💥


సగరుని తండ్రి బాహుకుడు. అతనిని శత్రురాజులు ఓడించి అడవులపాలు చేశారు. ఆయన అక్కడే కాలధర్మం చెందాడు. ఆయన పెద్ద ఇల్లాలు అప్పటికే నిండు చూలాలు. మగని మరణం ఆమెకు అశనిపాతమయింది.


భర్తతో సహగమనానికి పూనుకొన్న ఆమెను ఔర్వముని, అది ఇహపర సాధనం కాదని వారించాడు. ఆమె సవతులు అసూయతో ఆమెకు విష ప్రయోగం చేశారు. ముని కరుణించడం వలన ఆమెకు ఎలాంటి హాని కలగలేదు సరికదా, చక్కని తనయుని కని తనిసింది ఆ తల్లి!


గరళాన్ని- విషాన్ని జీర్ణించుకొని జన్మించాడు కాన అతనికి ‘సగరః’- సగరుడనే సార్థక నామం. గరమన్నా, గరళమన్నా సంస్కృతంలో విషమనే అర్థం. పెద్దవాడైన సగరుడు ప్రయోజకుడై చక్రవర్తిగా ప్రఖ్యాతి వహించాడు. 


ఔర్వ మహర్షి అనుగ్రహంతో సార్వభౌముడు సగరుడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు జయప్రదంగా నిర్వహించాడు. వందవ యాగంలో అసూయతో ఇంద్రుడు అశ్వాన్ని అపహరించి నాగలోకంలో తపోనిరతుడైన కపిల మహర్షి ఆశ్రమంలో ఒక మూలన బంధించి వెళ్లాడు.


సగరునికి సుమతి, కేశిని అను ఇద్దరు భార్యలు. వారిలో సుమతి కుమారులు అరవైవేల మందిని సగరుడు అశ్వాన్ని వెదకి తెండని పంపాడు.


భూతలమంతా అన్వేషించినా అశ్వం దొరకనందున వారు ఆశ్చర్యంగా భూమిని నిటారుగా తవ్వుకు వెళ్లారు. తవ్వగా ఏర్పడిన కందకాలే ముందుముందు సాగరాలయ్యాయి. సగర పుత్రుల వలన ఏర్పడినందు వల్ల సాగరాలనే పేరు కలిగింది.


సగరులు అథో లోకం చేరి కపిలుని ఆశ్రమంలో అశ్వాన్ని చూశారు. సమాధిలో ఉన్న కపిలుడే చోరుడని భ్రమపడి ఆయన మీద మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు కుమతులైన సుమతి కుమారులు. ఆ కోలాహలానికి కపిలుడు కళ్లు తెరిచాడు. అంతే! అప్పటికప్పుడే వారంతా బూడిద కుప్పలుగా మాడిపోయారు.


‘తపసుల గాసి పెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే!’- తపోధనులైన మహాత్ములను అవివేకంగా అపోహపడి బాధించే మదాంధులు మన (బతుక) గలుగుతారా?- అని పోతన అమాత్యుని ప్రమాద హెచ్చరిక!


సగర పుత్రులు కపిలుని క్రోధాగ్నికి ఆహుతి అయ్యారని కొందరంటారు. అది వందశాతం అసత్యం. అరవిందాక్షు(విష్ణు)ని అంశావతారమైన కపిలునికి కోపం కలిగిందనడం అనుచితం. అది పాపం కూడా! వాస్తవానికి వారి పాపమే శాపమై వారిని బూడిద చేసిందనడమే పాడి!


సగరునికి ‘కేశిని’ వలన ‘అసమంజసుడు’ అనే కుమారుడు కలిగాడు. అతను యోగభ్రష్టుడు. మాయికమైన లోక లౌల్యానికి- విషయ చాంచల్యానికి లోనుకాకుండా బాల్యం నుంచే అసమంజసుడు పిచ్చివాని వలె ప్రవర్తించేవాడు.


అయోధ్యలో సరయూనదీ తీరంలో ఆడుకునే అమాయకులైన బాలకులను నదీ ప్రవాహంలో విసిరి పారేస్తూ ఉండేవాడు. ఇలాంటి సమంజసం కాని- అర్థం పర్థంలేని అనుచిత ఆగడాలు చేసేవాడు కనుకనే ‘అసమంజసుడు’ అనే అన్వర్థ- సార్థక నామం!


ఇది తెలిసి సగరుడు మదిలో బాధపడి వానికి విధిలేక దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. రాజ్యం విడిచి పోతూ తన యోగశక్తితో ఆనాటి వరకు నీటిపాలైన పిల్లలందరినీ సజీవంగా బయటపడేశాడు అసమంజసుడు. మృతులైన ముద్దుబిడ్డలు బతికి రావడం చూసి అయోధ్యావాసులు పులకితులై అతి ఆశ్చర్యం పొందారు.


అరవై వేలమంది పుత్రులు మరలి రాకపోయేసరికి సగరుడు తన మనుమణ్ని- అసమంజసుని పుత్రుడైన అంశుమంతుని అన్వేషణకై ఆజ్ఞాపించాడు. పినతండ్రులు తవ్విన మార్గాన్ని అనుసరిస్తూ అంశుమంతుడు జ్ఞానానికి పెన్నిధి అయిన కపిలుని సన్నిధికి చేరి యాగ సైంధవాన్ని- అశ్వాన్ని చూచాడు. 


వినయంతో అంజలి గావించి మహర్షిని స్తుతించాడు. కపిలుడు ప్రసన్నుడై- ‘కుర్రవాడా! ఇదిగో మీ గుర్రం. మీ తండ్రుల భస్మరాశుల మీద గంగావారి (జలం) పారితే వారికి శుభం కలుగుతుంది- తరిస్తారు’ అని పలికాడు. 


సగరుడు యాగం పూర్తి చేసి, రాజ్యాన్ని అంశుమంతునికి అప్పగించి ఔర్వమహర్షి అనుగ్రహంతో ఉత్తమగతి పొందాడు. అంశుమంతుడు గంగావతరణకై తపస్సు చేసి కోరిన కోరిక తీరకుండానే కాలం చేశాడు. అతని సుతుడు దిలీపుడు కూడా సఫలీకృతుడు కాలేకపోయాడు.


దిలీపుని పుత్రుడే భగీరథుడు- మన కథానాయకుడు. పూర్వీకుల శ్రమను వృథా కానివ్వక సర్వథా సఫల మనోరథుడైన మహారాజు. ఆకాశగంగ అవని మీద అవతరించడానికి భగీరథుడు జీవితమంతా తపస్సుకు అర్పించాడు. మూడు తరాల తన పూర్వీకుల తపః ప్రభవం తోడు రాగా సూర్యవంశపు చుక్కలరేడు (చంద్రుడు) భగీరథుని తపస్సు ఫలించింది..


కం॥ ‘అతని సుతుండు భగీరథుఁ

డతి తపమొనరించి కనియె నమృతాపాంగన్‌

సుతరంగన్‌ ముఖ వనరుహ

రతభృంగన్‌ శివ జటాగ్రరంగన్‌ గంగన్‌’


అమృతంతో నిండిన క్రీగంటి చూపులు కలిగిన, అందమైన అలలతో విలసిల్లు, ముఖ కమలంపై ప్రేమతో ముసురుకొన్న తుమ్మెదలు కల, అంగజ (మన్మథ) మద సంహర్త (శివ) జటాజూటమే రంగస్థలంగా అమరిన అమర నది గంగ, దేవతా రూపంలో దర్శనమిచ్చి వరం వేడుకోమనగా భగీరథుడు ఇలా విన్నవించాడు..


కం॥‘మావారి భస్మరాసుల

నీ వారిం గలపికొనుము నెరి మావారల్‌

నీవారిఁ గలయ నాకము

మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!’


‘అమ్మా! మా వారి (పూర్వీకుల) బూడిద రాసులను, నీ వారి (నీటి)లో కలుపుకో, నీ పవిత్ర జలం సోకితే మా పితృదేవతలకు నాకం (స్వర్గం) ప్రాప్తిస్తుంది. తల్లీ! ఇది ప్రమాణ పూర్వకం.’


గంగ భగీరథుని ఇలా ప్రశ్నించింది- ‘రాజా! నేను నింగి నుంచి నేల మీదికి దూకుతుంటే నా వేగాన్ని నిలువరింపగలవాడెవ్వడు? ఆ తీవ్రగతిని, ఓ సుమతీ! వసుమతి సహించగలదా? లేనియెడల నేను పుడమిని చీల్చుకొని పాతాళానికి వెళ్లిపోతాను. మరోప్రశ్న- భూ లోకంలోని పాపాత్ములంతా నాలో మునుగుతూ ఉంటే, నాకు అంటే పాపాన్ని నేనెక్కడ వదలించుకోవాలి?’ ద్వితీయ సంశయానికి భగీరథుడు అద్వితీయంగా సమాధానం సమకూర్చాడు-


మ॥‘పరతత్తజ్ఞులు శాంతచిత్తులు తపః పారీణు లార్యుల్‌ ఘనుల్‌

పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి! భవదంభోగాహముల్‌ సేయఁగా

నరసంఘాఘము నిన్నుఁ బొందునె జగన్నాథుండు నానాఘ సం

హరుఁడా విష్ణుఁడు వారి చిత్తములఁ దానైయుంట మందాకినీ!’


‘ఓ మందాకినీ! పరతత్తం తెలిసిన వారు, శాంత చిత్తులు, తపోనిష్ఠులు అయిన సాధుసంతులు, మహాత్ములు నీలో మునిగితే నీ పాపాలు హరించుకుపోతాయి. వారి హృదయాలలో సకల కల్మషాలను కడిగివేసే తీర్థపాదుడు శ్రీహరి సదా కొలువు తీరి ఉంటాడు. అమ్మా! ఈ మట్టిమీద వట్టి పాపాత్ములే కాదు- భ్రష్టులు దుష్టులే కాదు, గట్టి జ్ఞానులు, తపోనిష్ఠులైన శిష్టులు, పుణ్యమూర్తులైన భక్తులు కూడా ఎందరో ఉన్నారు. కాన, ఇంచుక కూడా సంశయించకు.


ఇక మొదటి ప్రశ్నకు పరిష్కారం- తల్లీ! నిన్‌ ధరించుకొరకై శ్రీకంఠునిన్‌ గొల్చెదన్‌’- నిన్ను ధరించి భరించడం కోసం ఆ ధూర్జటిని (భారమైన జడలు గల ఆ శివుని) ధ్యానిస్తా’ అని గంగాదేవి వద్ద శెలవు పుచ్చుకొని భగీరథుడు వెంటనే శివుని నెలవు- హిమగిరి చేరి అక్కడ గిరీశుని గురించి తపించాడు.


భక్త వత్సలుడు శివుడు భగీరథుని తపస్సుకు మెచ్చి, దివి నుంచి భువికి ఉరుకుతూ వచ్చే గంగా సింధువు (నది)ను ఒక్క బిందువు కూడా కింద పడకుండా తన జటాజూటంలో బంధించాడు.


ఇలపైకి దిగినా ఇలా కపాలి జడలలోనే ఇమిడిపోయిన పుణ్యసలిల గంగ బయటకు వెడలి రావడానికి సడలని భక్తితో మరల గరళకంఠుని స్తుతించాడు. ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన జటాజూటంలోని ఒక జడ నుంచి గంగను ధారాపాతంగా కిందికి ప్రవహింపజేశాడు.


ఇలా అవనిని తాకిన ‘అలకనంద’ భగీరథుని అనుసరిస్తూ భూమిపై ముందుకు సాగుతోంది. ఆ మార్గంలోనే ఉన్న తన ఆశ్రమంలో జహ్నుముని యజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఉధృతంగా వస్తున్న ఆ గంగాప్రవాహానికి యజ్ఞసామగ్రి అంతా కొట్టుకుపోయింది. 


భగ్న హృదయుడైన ముని క్రుద్ధుడై గంగా జలాన్ని పూర్తిగా పానం చేశాడు. ఖిన్నుడై భగీరథుడు ప్రార్థించగా ముని ప్రసన్నుడై గంగను తన కూతురుగా భావించి తన కుడి చెవి ద్వారా బయటకు వెలువరించాడు. అప్పటి నుంచి గంగ ‘జహ్ననందిని’, ‘జాహ్నవి’గా కూడా కీర్తి గాంచింది.


భూ లోకం నుంచి సముద్రం ద్వారా పాతాళానికి చేరి సగరపుత్రుల భస్మరాశులపై ప్రవహించి వారిని తరింపజేసింది.


భగీరథుని తపఃఫలంగా భువికి దిగి వచ్చిన గంగ ‘భాగీరథి’గా విశేష ఖ్యాతి పొందింది. ఇప్పటికీ లోకంలో ఫలసిద్ధి వరకు పట్టు వదలని భట్టి విక్రమార్కుల పూనికకు ‘భగీరథ ప్రయత్నం’ అన్నది ఒక నానుడి అయింది.


#ఫలశ్రుతి:

ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగ పడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు.

‘నమామి గంగే పాద పంకజం’


సేకరణ.. 💐🙏 

హర హర మహాదేవ శంభో శంకర

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు