💥మార్గశిర పౌర్ణమి – దత్తజయంతి💥
⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏
💥మార్గశిర పౌర్ణమి – దత్తజయంతి💥
గురు శక్తి అనంతం. గురు కృప అపారం. తన అనంత శక్తితో, అపారమైన కృపావర్షాన్ని కురిపించిన సద్గురుమూర్తి దత్తాత్రేయుడు.
దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం.
విష్ణు అంశగా జన్మించి సనాతన ధర్మంలో అవధూత సంప్రదాయానికి బాటలు పరిచాడు.
దత్తుడిగా, శ్రీపాద శ్రీవల్లభుడిగా, నరసింహ సరస్వతిగా ఏ అవతారంధరించినా లోకోపకారమే పరమావధి.
మార్గశిర పౌర్ణమి "దత్త జయంతి" ఈ సందర్భంగా సద్గురు లీలలు స్మరించుకుందాం.
💥అత్రి మహాముని సుపుత్రుల కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఆ తపస్సు ఫలించి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు.
"మా అంశతో మీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు" అని వరమిస్తారు. ఆ ఫలితంగానే అత్రి, అనసూయ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రాంశతో దుర్వాసుడు జన్మిస్తారు. అలా మహావిష్ణువు అంశతో జన్మించిన అవతారమూర్తే దత్తాత్రేయుడు.
చిన్నప్పటి నుంచి దత్తుడు లోకోత్తరమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. అనేక మంది మునీశ్వరులకు అపూర్వమైన యోగ విద్యను ప్రసాదిస్తూ ఉండేవాడు.
తల్లి అనసూయా దేవికి కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు.
కపిలుడి అవతారంలో తల్లి దేవహూతికి ఆత్మబోధ చేస్తే, దత్తావతారంలో తల్లి అనసూయకు ఆత్మబోధ చేశాడు.
అనంతరం దత్తాత్రేయస్వామి భక్త రక్షణార్థం సహ్యాద్రి గుహల్లో తపస్సు ఆచరించాడు.
ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వేదాలను మరచిపోయి దత్తాత్రేయుడిని ఆశ్రయించాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు స్వామి బ్రహ్మదేవుడికి వేద దానం చేశాడట.
మరొకప్పుడు జంభాసురుడనే రాక్షసుడి పీడ నుంచి దేవతలను దత్తాత్రేయుడే రక్షించాడు.
అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.
కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్య యౌవనం వరాలుగా పొందాడు.
రావణాసురుడిని జలాపహరణం చేసినందుకు శపించాడనే కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది.
అదే విధంగా ప్రహ్లాదుడికి అజగర వ్రతధారి ముని రూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
ఇలా అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే శ్రీదత్తాత్రేయ అవతారం.
స్వామి ఇహ, పర ఉభయ ఫలప్రదాత. అందుకే ఏడుకొండలపై దీనదయాళుడైన ఆ శ్రీనివాసుడిలో దత్తాత్రేయస్వామిని దర్శించుకుంటూ...
తానె తానె ఇందరి గురుడు సానబట్టిన భోగి
జ్ఞానయోగి...
తనరగ కపిలుడై దత్తాత్రేయుడై.. ఘనమైన మహిమ శ్రీవేంకటరాయడై!... అంటూ పద కవితా పితామహుడు అన్నమయ్య నీరాజనాలు అర్పించాడు.
దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు.
ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు.
దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు.
శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోక కల్యాణ కారకాలు.
💥భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు.
అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు.
కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేప నుంచి త్యాగచింతన నేర్చుకోవాలి.
మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి.
సాలెపురుగు నుంచి సృష్టి స్థితి లయ కారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి.
సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి.
ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి.
చీమలా జిహ్వ చాపల్యానికి లోను కారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు - జగద్గురువు దత్తాత్రేయ స్వామి!
అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.
దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు.
తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా "అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకం.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment