పరమ పవిత్రం.. ధనుర్మాసం

 ⚜️🕉️🚩ఓం మధుసూదనాయ నమః🌹🙏


💥పరమ పవిత్రం.. ధనుర్మాసం


సూర్యుడు "ధనుస్సు" రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను... సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు.


ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెసీమల్లో సంక్రాంతి "నెల పట్టడము" అంటారు.


విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి "మార్గళి వ్రతం" పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది.


💥#తిరుప్పావై


సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే "తిరుప్పావై". వేదాలు, ఉపనిష త్తుల సారమే తిరుప్పావై అని పురాణాల ఆధారం.


విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది.


30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెపుతాడు. ఆమె ఈవిషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. 


రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదా దేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీన మైపోతుంది.


💥ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం, వైష్ణవ ఆలయాలను సందర్శించడం శుభప్రదం.


ప్రతిరోజు సూర్యోదయం కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని, తల స్నానం చేసి నిత్య పూజలు ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి.


💥#ధనుర్మాస_వ్రతం:


ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం.


ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి.


తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్ర నామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. 


ఈ నెల రోజులూ విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు, లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు.


వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.


శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా

తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా


💥ఈ మాసంలో విష్ణువును "#మధుసూధనుడు" అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్రపొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి.


విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని "#బాలభోగం" అని పిలుస్తారు.


ఈ నెల రోజుల పాటు బాలికలు, మహళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు.


నెల రోజులూ హరి దాసుల కీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడించే వారితో సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముగ్గులతో కనుల విందుగా వుంటాయి.


ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు ‘సంక్రాంతి’ పండుగకు ఎదురు చూస్తూ ఉండే కాలం ఇది.


ఈ నెల రోజుల పాటు చేసే విష్ణు ఆరాధన చాలా విశేష ఫలితాలు ఇస్తుందని, ఈ రోజుల్లో స్వామి వారికి సమర్పించే నివేదనలను ప్రసాదంగా స్వీకరిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆద్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి