శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
💥శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం - భావ సహితం💥
ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కలాధరావతంసకం విలాసి లోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ||1||
భావము:
సంతోషముతో (మోదముతో) మోదకములను రెండు చేతులా గ్రహించి, సదా విముక్తిని (మోక్షమును) కలుగజేసెడి, అందుకు గుర్తుగా చంద్రవంకను ధరించెడి, విలాసించుచు లోకములను రక్షించెడి శ్రీ వినాయకునకు నమస్కారము. నాయకులు లేని వారలకు నాయకుడైనట్టి (దిక్కులేని వారికి అన్ని దిక్కులు తానైనట్టి), గజాసుర వధకు కారణమైనట్టి, భక్తుల పాలిట అశుభములను హేలగా తృంచునట్టి, తనకన్న వేరొకటి లేనట్టి శ్రీ వినాయకునికి నమస్కారము.
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||2||
భావము:
నయితి అన్న భావనను వదిలి అహంకరించు వారికి భీకర స్వరూపుడై విఘ్నములను కలిగించెడి, అప్పుడే ఉదయించిన బాల సూర్యునివలె ప్రకాశించునట్టియు, ఆశ్రయించిన వారిని ఆపదలనుండి ఉధ్ధరించునటువంటి, దేవులకు దేవుడు, సమస్త నిధులను కృపచేయగలిగినట్టి ఈశ్వర స్వరూపుడు, గణములకు ఈశ్వరుడు, తానే మహేశ్వరుడైనట్టి (ఆత్మావై పుత్రనామసి) ఆ పరాత్పరుడైన (అన్ని తత్వములకన్న అధికమైనట్టి మాయ కన్నా అధికుడైన), బ్రహ్మమే అగు శ్రీ వినాయకునికి నమస్కారము.
సమస్త లోక శఙ్కరం నిరస్త దైత్య కున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||3||
భావము:
అన్ని లోకములకు శుభములను చేకూర్చెడివాదును, గొప్ప గొప్ప రక్కసులను తొలగించినవాడును, తక్కువకాని బొజ్జ కలిగి మహోత్తముడై ఉత్తమమైన గజవదనము కలవాడు, గొప్ప దయ, కృప, క్షమ, ఓర్పు కలవాడు, ఎల్లప్పుడు సంతోషములను చేకూర్చెడివాడు, గొప్ప కీర్తి కలిగించెడివాడు, నమస్కరించువారలకు మంచి మనస్సునిచ్చువాడు, గొప్ప కాంతి కలవాడునగు శ్రీ వినాయకునకు నమస్కారము.
అకిఞ్చనార్తి మర్జనం చిరన్తనోక్తి భాజనం
పురారిపూర్వనన్దనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపఞ్చనాశ భీషణం ధనఞ్జయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ||4||
భావము:
దరిద్రుల దారిద్ర్యబాధల పోగొట్టునదియు, వేదములచే ప్రతిపాదితమైనదియు, త్రిపురహరుని జ్యేష్ఠ పుత్రునివలె వెలుగొందునట్టియు, దేవతలయొక్క శత్రువుల గర్వమును భంజించునట్టియు (నమిలివేయునట్టియు), ప్రపంచ నాశకాలమున (మహాప్రళయమందు) భయంకరమైనట్టియు, అగ్ని మొదలగు దేవతలకు శిరోభూషణమైనట్టియు, తన చెక్కిళ్ళయందు మదజలముతో ఉండెడి పురాతనమైనట్టియు (మొదలు తెలియనట్టియు) ఐన గజ ముఖముతో విలసిల్లెడి శ్రీ వినాయకునికి నమస్కారము.
నితాన్త కాన్త దన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయ కృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేకమేవ చిన్తయామి సన్తతమ్ ||5||
భావము:
ఎంతో గొప్పనైన, మనోహరమైన దంతపు కాంతి కలిగినవాడు, యమునిని అంతము నొందించిన శివునకు కొడుకై తనకెప్పుడూ అంతములేక విఘ్నములను తీసివేయుచు, ఆలోచింపశక్యముకాని స్వరూపముతో మహాత్ముల, యోగిపుంగవుల హృదయమున ఎల్లప్పుడు నివసించెడివాడును, సర్వలోక ప్రసిద్ధుడైన, ఆ ఏకదంతుని ఎల్లప్పుడు మనసున ధ్యానించుచుండెదను.
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రగాయతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరం |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ||6||
భావము:
మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము, దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి మంగళములను పొందెదరు.
ఇతి శ్రీ శంకరాచార్య కృత గణేశపంచకం సంపూర్ణం ||
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment