⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
💥భజే బ్రహ్మతేజం!
హనుమంతుడు అంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్, చిత్త సంస్కారం కూడా గోచరమవుతుంది. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో, అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది.
ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో, అంతటి పరమశాంత చిత్తం కూడా దర్శనమిస్తుంది. వ్యాకరణ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక గుణగణాల మేలుకలయికగా హనుమ రామాయణంలో అనేకచోట్ల దర్శనమిస్తాడు.
హనుమాన్ అంటే ‘జ్ఞానవాన్’ అని భావం. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అని అర్థం. ‘హనువు’ అంటే ‘దవడలు’ అని కూడా చెబుతారు. శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’- ఈ మూడు కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా తెలుస్తున్నది.
హనుమంతుడు అనగానే అద్భుతమైన బలపరాక్రమాలు గుర్తుకువస్తాయి. అపరిమితమైన భుజశక్తికి తోడు ఆయన గొప్ప విద్యావేత్త కూడా. కర్మసాక్షి, ప్రత్యక్షదైవం అయిన సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యలూ నేర్చుకున్నాడు.
ఓ రోజు హనుమంతుడు.. సూర్యుడి దగ్గరకు వెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించమని అభ్యర్థిస్తాడు. ‘క్షణం స్థిరంగా ఉండని నేను నీకెలా విద్య నేర్పగలను’ అన్నాడు సూర్యుడు. అమాంతం శరీరాన్ని పెంచిన హనుమ తూర్పు పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టాడు. సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య నేర్పించమని ప్రార్థించాడు.
తన శిష్యుడి శక్తిసామర్థ్యాలకు ముచ్చటపడిన సూర్యుడు హనుమకు గురువయ్యాడు. ఆయన దగ్గర వేదాలు, వ్యాకరణం సహా అన్ని శాస్ర్తాలు నేర్చి గొప్ప పండితుడయ్యాడు హనుమ. అంతటివాడు కాబట్టే హనుమ మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేదని ఏదీ ఉండదంటాడు రాముడు. ఎవరో నిరాశ పరిచారనో, ఏవో అడ్డంకులు వచ్చాయనో ఎంపిక చేసుకున్న విద్య నేర్చుకోవటాన్ని మానుకునే నేటితరం విద్యార్థులకు హనుమ ఆదర్శం.
హనుమకు తల్లి అంజనాదేవి పెట్టిన పేరు సుందరుడు. అద్భుతమైన సౌందర్యమూర్తి. సూర్యుడిని మింగాలని ఆకాశానికి ఎగిరిన బాలాంజనేయుడిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కబడిన దవడలు కలిగిన వాడు కావటంతో సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు.
రామాయణంలో అన్ని సర్గలకు అందులోని కథాంశాన్ని బట్టి పేరు ఉంటుంది. కానీ, సీతాన్వేషణ జరిగిన సర్గకు మాత్రం సుందరకాండ అన్నాడు వాల్మీకి. హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకే ఆ పేరు పెట్టారని ప్రతీతి. రామాయణంలో హనుమ తన గురించి ఎక్కడా చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనతంతా రాముడికే కట్టబెట్టాడు. ఆ హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది.
రాముడి బంటుగా హనుమయ్య అందరికీ తెలుసు. శ్రీరాముడే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది. దీనిప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు ఇంద్రుడు. హనుమ మూర్ఛపోతాడు.
బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో అన్నిలోకాల్లో ఉన్న గాలిని స్తంభింపజేస్తాడు. దీంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు సకల దేవతలతో అక్కడికి వస్తాడు.
హనుమను పునర్జీవితుడిని చేసి దేవతలందరూ అనేక వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో "హనుమత్ వ్రతం" వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ ఆంజనేయుడే చేసిపెడతాడని బ్రహ్మదేవుడు చెబుతాడు.
ఈ కథంతా రాముడికి హనుమే స్వయంగా వివరించాడు.
సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో హనుమంతుడిని వేదిక మీద కూర్చోబెట్టి లక్ష్మణుడితో కలిసి ఈ వ్రతం ఆచరిస్తాడు. ఫలితంగా సీతాన్వేషణ మొదలుకుని సీతారామ పట్టాభిషేకం వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. తన యజమాని చేత పూజలందుకున్న ఏకైక బంటు హనుమ మాత్రమే.
ఆ స్వామిని మనసారా స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండటం, వాక్పటుత్వం మొదలైన లక్షణాలు సంప్రాప్తిస్తాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment