మార్గశిర ఏకాదశి - గీతా జయంతి
⚜️🕉️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏
💥మార్గశిర ఏకాదశి - గీతా జయంతి💥
శృణు సుశ్రోణి వక్ష్యామి గీతాసు స్థితిమాత్మనః
వక్తాణి పంచ జానీహి పంచాధ్యాయానను క్రమాత్
దశాధ్యాయాన్ భుజాంశ్చైకముదరం ద్వౌ పదాంబుజే
ఏవమష్టాదశాధ్యాయీ వాఙ్మయీ మూర్తిర్యైశ్వరీ
ఒకసారి లక్ష్మీదేవి భగవద్గీత గురించి ప్రశ్నిస్తే శ్రీమహావిష్ణువు ఆ సందేహాలన్నీ తీర్చి, గీత తన బాహ్య స్వరూపమన్నాడు. అందుకే గీతను విష్ణువు వ్యక్తదేహంగా భావిస్తారు.
మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలు,
తర్వాతి పది అధ్యాయాలు పది భుజాలు,
పదహారో అధ్యాయం ఉదరం,
చివరి రెండు అధ్యాయాలూ రెండు చరణాలని భావం.
"సాగరాన్ని దాటడానికి ఈత - భవసాగరాన్ని దాటడానికి గీత" అన్నారు.
💥అత్యంత పరాక్రమశాలి, సమస్త అస్త్ర శస్త్ర సంపన్నుడు, రణరంగ ధీరుడైన అంతటి అర్జునుడు సైతం కురుక్షే త్ర సంగ్రామ ఆరంభంలో... తన ముందున్న పరిస్థితిని గ్రహించిన మరుక్షణం భావోద్వేగాలకు లోనయ్యాడు.
తీవ్ర ఒత్తిడితో ఒళ్ళంతా కంపించి, చేతిలోని గాండీవాన్ని జారవిడిచి, రథంలో కుప్పకూలిపోయాడు. యుద్ధాన్ని విరమించాలనుకున్నాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకొనే వాదనలు వినిపించసాగాడు.
కొన్నిసార్లు పరిస్థితుల ఒత్తిడిని భరించలేక... మనం ఆచరించవలసిన విద్యుక్త ధర్మాలను విడిచిపెట్టి, మారుమూల ప్రదేశానికి పారిపోయేలా పలు సందర్భాలు ప్రేరేపిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితి అర్జునుడంతటి యోధునికీ తప్పలేదు.
అర్జునుడి మాటలను విన్న కృష్ణుడు
"అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున...
ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి నీకు ఎలా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ గతులకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుచేస్తుంది" అని హితవును బోధిస్తూ కొనసాగించిన సంభాషణే "భగవద్గీత"గా విశ్వ విఖ్యాతమై నిలిచింది.
💥అసలు అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి?
శ్రీకృష్ణుడు భగవద్గీతలో అస్త్ర శస్త్రాల గురించి కానీ, యుద్ధ నైపుణ్యాల గురించి కానీ ప్రస్తావించలేదు.
జీవిత సత్యాలను ఉపదేశించాడు.
శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించిన అర్జునుడు...
‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని వేడుకున్నాడు. (భగవద్గీత- 2:7)
సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలనీ, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహాలలో బందీల్లా జీవిస్తున్నారన్న సత్యాన్ని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు.
"ఏ విధంగానయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యం, యౌవనం, వార్థక్యాలలోంచి సాగిపోతుందో, అదే విధంగా మరణ సమయంలో... జీవాత్మ మరో దేహం (శరీరం) లోనికి ప్రవేశిస్తుంది. ధీరుడైన వాడు ఈ విషయంలో మోహం చెందడు" అని చెప్పాడు. (భగవద్గీత- 2:13)
అర్జునుడు "ఓ అచ్యుతా! నీ కృపవల్ల నా మోహభ్రాంతి నిర్మూలన అయింది. నేను జ్ఞానంలో స్థితుడినై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు. నీ ఉపదేశాల ప్రకారం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను" అని చెప్పాడు. (భగవద్గీత- 18:73)
భగవద్గీత జీవన పోరాటాల నుంచి పలాయనాన్ని బోధించదని చెప్పేందుకు ఇదే నిదర్శనం.
శ్రీకృష్ణుణ్ణి శరణు వేడి... జీవన పోరాటాన్ని కొనసాగించమనే ప్రోత్సహిస్తుంది. భగవద్గీతలోని శ్రీకృష్ణుని ఉపదేశాలను, అనుసరిస్తే... మోహభ్రాంతుల నుంచి దూరమై, జీవితంలో సరైన విధంగా నడుచుకోగలం. జీవితంలోని నిరాశ, నిస్పృహల నుంచి ఉపశమనాన్ని పొందే మార్గం ఇదే.
💥"అన్నీ నేనే", "నువ్వు నిమిత్త మాత్రుడివి" అనే ఆధ్యాత్మిక రహస్యాన్ని ఉదాహరణలు, సోదాహరణలతో వివరిస్తూనే,
సోమరితనం, కర్మ అనాసక్తతను ప్రోత్సహంచకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, చేయాల్సిన పనిచేసి తీరాల్సిందే అనే పరమ సత్యాన్ని నొక్కిచెప్పే అసమాన అభివ్యక్తీకరణ భగవద్గీత.
అందుకే భగవద్గీత (గీత) గీతామాత అయ్యింది. పూజ్యనీయురాలైంది. పూజలు అందుకుంటోంది.
అటువంటి శాశ్వత మార్గదర్శి అయిన భగవద్గీత ఆవిర్భవించిన రోజును మనం ‘గీతాజయంతి’గా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా, ప్రతిఒక్కరూ ‘భగవద్గీత’ గ్రంథాన్ని కూలంకషంగా చదివి, ఆకళింపు చేసుకోవాలి.
అలాగే పిల్లలకు పసితనం నుంచే భగవద్గీతను బోధించాలి. అది వారికి కర్తవ్యబోధ చేస్తుంది. జీవితంలో ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులనైనా చాకచక్యంగా ఎదుర్కొని విజయం సాధించగల స్థైర్యాన్ని కచ్చితంగా అందిస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment