⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥
భగవంతుడి విశ్వ సృష్టి కార్యంలో ప్రప్రథమంగా ఆవిర్భవించిన దైవం శ్రీ గణేశుడు. విశ్వ సృష్టి జరగకముందే ఓంకారనాదం వెలువడింది. అలా ప్రప్రథమంగా ఏర్పడిన నాదంతోనే విశ్వమంతా చైతన్యంతో నిండింది.
మొదటగా పవిత్రమైన, శుభప్రదమైన, స్వచ్ఛమైన దాన్ని సృష్టించాలని తలచిన ఆదిశక్తి... ఆ లక్షణాలకు ప్రతిరూపంగా చైతన్యరూపంలో గణేశుణ్ణి సృష్టించింది.
ఓంకారంలో శ్రీ మహాకాళి, శ్రీ మహా సరస్వతి, శ్రీ మహా లక్ష్మి... ఈ మూడు శక్తులూ ఉంటాయి. అంటే గణేశునిలో ఆ మూడు శక్తులూ ఉంటాయి.
సృష్టిలోని పదార్థ సముదాయమంతటికీ మూలకారకుడు గణేశుడే. ఆయన తత్త్వం బహు సూక్ష్మమైనది. అన్ని పదార్థాలలోనూ, ప్రతి అణువులోనూ ఆయన చైతన్యం నిండి ఉంటుంది.
మనం జరుపుకొనే శుభకార్యాల్లో, పూజల్లో ముందుగా ఆహ్వానించేది, ప్రతిష్ఠించేదీ గణపతినే. ‘‘నీవే కర్తవు. నీవే ఈ భూమికి ఆధారం. నీవే విఘ్నాలన్నీ తొలగించేవాడివి. నీవే సర్వస్వమైన బ్రహ్మవు. నీవే శాశ్వతమైన ఆత్మవు. నీవే అన్ని వైపుల నుంచీ నన్ను కాపాడగలవు’’ అంటూ స్తుతించింది ‘శ్రీ గణేశ అధర్వ శీర్షం’.
మన సూక్ష్మ శరీరంలోని చక్రాలలో పంచ మహాభూతాలు స్థిరపడడం గురించి ‘సౌందర్య లహరి’లో ఆదిశంకరులు వివరిస్తూ ‘మహీం మూలాధారే’ అంటారు.
అంటే మనలోని ఏడు చక్రాల్లో మొదటి శక్తికేంద్రం మూలాధార చక్రం. అది పృధ్వీతత్త్వంతో రూపొందుతుంది. గణేశుణ్ణి కూడా ఆయన తల్లి గౌరీదేవి భూతత్త్వంతోనే తయారు చేసింది.
మూలాధార చక్రమే గణేశుడి నివాస స్థానం. ఆయన ఆ చక్రానికి అధిదేవత. అక్కడి నుంచి ఆయన సదా మనల్ని రక్షిస్తాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి మూలమైన కుండలినీ శక్తి మేలుకొని, ఊర్థ్వముఖంగా పయనిస్తున్నప్పుడు... ఆ శక్తిని సదా సంరక్షించేది ఆయనే.
ఆయన ప్రమేయం లేకుండా కుండలినీ శక్తి జాగృతం కాదు. అది కాకపోతే ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. కాబట్టి ఆయన గుణాలు, లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి.
గణేశుడు మనకు వివేకాన్ని, విచక్షణను అనుగ్రహిస్తాడు. వివేకవంతుడికి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానమే కాకుండా... తన శక్తి సామర్థ్యాల గురించి కూడా తెలిసి ఉంటుంది. వివేకాన్ని ఏది నాశనం చేస్తుందో గమనిస్తూ... జాగ్రత్తగా మెలగాలి.
గణేశుడు తన వివేకంతోనే దేవతలందరినీ అధిగమించాడు. ఆయన ఎప్పుడూ తల్లిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో ఉంటాడు. తల్లిపట్ల ఉండవలసిన వినయ విధేయతలు, గౌరవం ఆయన నుంచి నేర్చుకోవాలి.
అలాగే ఇక్కట్లకు, అవరోధాలకు గురవుతున్నవారికి గణేశుడి దీవెనలు ఎంతో అవసరం. అందుకే ఆయనను ‘సంకట విమోచనుడు’ అంటారు.
మనలోని గణేశ తత్త్వాన్ని సంరక్షించుకొని... మనల్ని మనం పరిశుద్ధులుగా, కళ్ళను కల్మషరహితంగా ఉంచుకొని, తోటివారితో స్వచ్ఛమైన, నిర్మలమైన సత్సంబంధాలను అభివృద్ధి పరచుకుంటే ఎటువంటి సమస్యలూ దగ్గరకు రావు.
సేకరణ... 🌹🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment