💥సకల శుభకరం క్షీరాబ్దిద్వాదశి
⚜️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥సకల శుభకరం క్షీరాబ్దిద్వాదశి
మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తీక శుక్లపక్ష ద్వాదశి. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు.
మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అన్నారు.
మథించడం అంటే చిలకడం. కాబట్టి ‘చిలుకు ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం.
ఎల్లవేళలా క్షీర సాగరంలో శేషశయ్యపై శయనించి ఉండే విష్ణుమూర్తి ఈ రోజు బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడని, అందువల్ల బృందావనంలో ఎవరు శ్రద్ధాసక్తులతో విష్ణుపూజ చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సిద్ధిస్తాయని పురాణ కథనం.
అత్యంత పుణ్యప్రదమైనది కాబట్టి "పావన ద్వాదశి" అని, అలాగే యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి "యోగీశ్వర ద్వాదశి"గానూ ప్రాచుర్యం పొందింది.
స్వాయంభువ మన్వాది సంవత్సరాలను క్షీరాబ్ది ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు. ఏకాదశి నుంచి పూర్ణిమ వరకూ ‘భీష్మ పంచక వ్రతం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి.
మరణశయ్యపై ఉన్న పితామహుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళ గంగను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘బృందావని ద్వాదశి’గా పిలుస్తారు.
క్షీరాబ్ది ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవించిందనీ, ఆ రోజునే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ ‘చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోంది. అందుకే ఈ రోజు లక్ష్మీ నారాయణ కల్యాణం నిర్వహంచే సంప్రదాయం ఏర్పడింది.
విష్ణుమూర్తినీ, మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వెళ్ళి, అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ది వ్రత కథ చెబుతోంది.
లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభ తిథి కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు.
తులసీని శ్రీలక్ష్మిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుని గాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు.
తులసి సన్నిధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నా యి. తులసితో కృష్ణునికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహించడానికి ముఖ్య కారణం.
ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోపచారాలతో పూజించి, వివిధ రకాల పండ్లు, చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, హారతి ఇస్తారు.
ముత్తైదువను శ్రీ మహాలక్ష్మిగా సంభావించి, పసుపు కుంకుమలు, ఫల పుష్ప తాంబూలాదులతో సత్కరించి, దీవెనలు పొందుతారు. అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం.
రోజంతా ఉపవసించిన గృహిణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకొని, ఉపవాసాన్ని విరమిస్తారు.
ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగించడం మన సంస్కృతిలో భాగం. అలా పెట్టలేని వారు కార్తీక మాసంలోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి.
అది కూడా చేయలేనివారు ద్వాదశి నాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే, సంవత్సరమంతా దీపం వెలిగించినట్టవుతుందని శాస్త్ర వచనం. ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ ‘కార్తిక పురాణం’ చెబుతోంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment