💥కార్తీక పౌర్ణమి💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥కార్తీక పౌర్ణమి💥

త్రిపుర పూర్ణిమ..  రాస పూర్ణిమ.. దేవ దీపావళి.

ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. 


త్రిపురాసుర సంహారం ఆనందంలో దేవతలందరు దివి నుంచి దిగి వచ్చి దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని చెబుతారు.


కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. 


ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా... మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే... కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.


ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది.

శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు.

విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి.


మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. 


ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు.


వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.


రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు.


కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట "దీపం"🪔 వెలిగిస్తారు.


"కార్తీక పౌర్ణమి" నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.

కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.


💥#త్రిపురాసుర_సంహారం💥


తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చేతిలో నిహతుడయిన రాక్షసుడు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవవాని పేరు కమలాక్షుడు, మూడవ వాని పేరు విద్యున్మాలి.


వీళ్ళు ముగ్గురు  బ్రహ్మదేవునీ కోసం తపస్సు మొదలుపెట్టారు.


బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ‘మీకు ఏమి వరం కావాలి?’ అని అడిగారు. వారు తమకి చావు లేకుండా ఉండాలని కోరారు. బ్రహ్మదేవుడు  'ఆత్మకి చావు లేదు. శరీరము చావకుండా ఉండలేదు. మరణం అనేది జగత్తు ధర్మము.  

మరణం లేకుండా ఈ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం అనేది కుదరదు’ అని చెప్పాడు. 


ఇది విన్న వాళ్ళు బ్రహ్మగారితో ‘నీవు మయుడిని పిలిపించి ఒక బంగారు నగరమును, ఒక వెండి నగరమును, ఒక ఇనుప నగరమును (త్రిపురాలు) నిర్మింపజేయి.  మా ముగ్గురు అన్నదమ్ములం ఆ మూడింటిలో ఎక్కుతాము. 


అవి మూడూ ఆకాశంలో ఆగకుండా తిరుగుతుండాలి.

ఈ మూడు పురములు ఎప్పుడూ ఒక సరళరేఖలోకి రాకూడదు. 


వెయ్యి దివ్య సంవత్సరములకు ఒక్క క్షణం సేపు మాత్రం ఈ మూడు పురములు ఒకే సరళరేఖలోకి వచ్చి నిలబడాలి. 


ఇలా నిలబడినప్పుడు మిట్టమధ్యాహ్యం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కలా వర్తక మేఘములలోంచి వర్షము కురుస్తుంటే ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కొత్త రథం ఎక్కి... ఇంతకు పూర్వం లోకంలో ఎవరూ పట్టుకోని ఒక అపూర్వమయిన ధనుస్సు పట్టుకుని... ఒకే బాణంతో దేవతాసార్వభౌముడు కొడితే అప్పుడు మేము చనిపోతాము. 


ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద ఎక్కి అటువంటి వారు కొట్టకపోతే మరల మేము బ్రతికేస్తాము. కాబట్టి అలా మాకు వరం ఇవ్వవలసినది’ అని అడిగారు. 

అపుడు బ్రహ్మగారు తథాస్తు అన్నారు.


వీరి హింస భరించలేని దేవతలు త్రిపురాంతకుల బాధలనుండి రక్షించమని శివుణ్ని ప్రార్థించారు.


శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉత్తమ రథాన్ని, ధనుర్బాణాలనూ నిర్మించవలసిందని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.


విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మించాడు. 


రథానికి సూర్యచంద్రులు చక్రాలయినారు.

బ్రహ్మదేవుడు సారథి అయి పగ్గాలు చేతబట్టాడు.

మేఖలాచలం గొడుగు గాను, మందరగిరి పార్శ్వదండం గాను మారాయి. 

మేరుపర్వతం విల్లుగానూ, అనంతుడు వింటినారి గాను మారారు. 

శారదాదేవి వింటికి కట్టిన చిరుగంటలుగా మారినది.

విష్ణువు మహాతేజస్సుతో బాణం గా మారాడు.

అగ్నిదేవుడు బాణపుమొన అయినాడు. 

నాలుగు వేదాలు నాలుగు గుర్రాలైనాయి.


శివుడు ఆ రథాన్ని ఎక్కి పార్వతీదేవితో బయలుదేరాడు. 

కాంచన, రజత, తామ్ర పురాలు మూడూ ఒక దానిని ఒకటి సమీపిస్తుండగా, శివుడు ధనుర్బాణాలు చేతబట్టి రథంలో నిలబడ్డాడు. 


త్రిపురాలు ఏకమైనాయని బ్రహ్మ శివుణ్ణి హెచ్చరించాడు. 

వెంటనే శివుడు వింటితో బాణాన్ని సంధించి విడిచాడు. 

అది త్రిపురాలను తాకి భస్మంచేసి, శివుని వద్దకు వచ్చింది. 


త్రిపురాసురులు పరివారంతో సహా దగ్ధమైపోయారు.

శివుడు "త్రిపురాంతకుడు" అయినాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి