⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏
⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం॥
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి॥
భావం:
మనో, వాయువేగాలకు సమానమైన వేగం కలిగినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయు కుమారుడు, వానరయోధులలో ముఖ్యుడైన శ్రీరామదూతకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
భారతీయ భక్త సామ్రాజ్యాధినేతలలో అగ్రశ్రేణికి చెందినవాడు, శ్రీరామభక్తి పారవశ్యంతో పునీతమైనవాడు హనుమంతుడు.
‘రామునికన్నా రామభక్తి గొప్పది’ అని నిరూపించిన కపివరుడాయన.
అన్ని శక్తులు తమకున్నా సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు, ఓర్పుతో మానవాళికి ఒక ప్రవర్తనా నియమావళిని నేర్పించినవాడు. అంజన్న కథలన్నీ ఒకచోట పేరిస్తే దైవ వ్యవహారాల్లోని ప్రతీకల అంతరార్థం మనకు అర్థమవుతుంది.
'రామాయణం’లో అతిముఖ్యమైన పాత్రగా కనిపించే హనుమంతుడు మానవ మనస్తత్వానికి గొప్ప సంకేతం. మనిషి అన్నవాడు రూపుదిద్దుకోవడానికి ‘మూడు అంశాలు’ ప్రధానంగా దోహదపడతాయి.
అన్నిటికీ మూల చైతన్యమైన ఆత్మ, ఆ శక్తిని స్వీకరించి ప్రచోదన శక్తిగా మారే మనసు, పై రెండిటివల్ల చైతన్యమయ్యే శరీరం! ఈ మూడూ ఉన్నప్పుడే లోకంలో ‘మానవుడు’గా కొనసాగగలుగుతాడు. వీటిని రామ-హనుమంతులకూ అనువర్తింప జేయవచ్చు.
రాముడు ‘ఆత్మ’కు ప్రతీక. అందరం ‘ఆత్మారాముడు’ అంటాం. ‘మనసు’కు ప్రతీక హనుమంతుడు. ఆత్మశక్తి, చైతన్యం వద్ద ‘మనసు’ తలవంచుతుంది. కనుకే, మనం చూస్తున్న ప్రతి విగ్రహాదుల్లోనూ రామునిముందు హనుమ ఎప్పుడూ తలెత్తి కనిపించడు. సొంత నిర్ణయాలు తీసుకోడు. మనసు తత్త్వమూ ఇదే. తన శక్తి ఎంతో దానికి తెలియదు. ఎవరివద్ద కూర్చుంటే ‘శక్తి’ వస్తుందో తెలియజెప్పినవాడు హనుమంతుడు.
ఆత్మ దగ్గర, ఆత్మవిధాన పరిధిలో ఉన్న హనుమంతుని లోని గొప్పదనం ‘సుందరకాండ’లో లంకా నగరాన్ని తగుల పెట్టినప్పుడు ప్రదర్శించిన ‘కోతిచేష్ఠల’లో మనకు కనిపిస్తుంది. ఇదికూడా గంభీరమైన విధానమే.
సాధారణంగా అర్థం చేసుకుంటే, రాముని ఆజ్ఞను మాత్రమే పాలించే హనుమంతుడు, సీతను ‘చూసి రమ్మంటే కాల్చి’ వచ్చాడు. మన మనసుకూడా సొంత నిర్ణయం తీసుకుంటే శరీరం అనే లంకకు ఇబ్బందే. మనసు ఆత్మతో కూర్చుంటే శరీరం ఎప్పటికీ ఆనందమయమే. తన శక్తి తనకు తెలియనివాడు హనుమంతుడు. మన మనసుకూ తన శక్తి తెలియదు. మరొకరు ప్రోత్సహించినప్పుడే ముందుకు వెళ్ళడానికి ఉద్యుక్తమవుతుంది.
హనుమంతుడిని కూడా జాంబవంతుడు ఇలాగే ప్రోత్సహించాడు. ‘శరీరం, మనసు, ఆత్మ’ ఇవి మనకు త్రిపురాల వంటివి. దేహం ‘లోహపురం’ అయితే మనసు ‘రజతపురం’, ఇక ఆత్మ ‘స్వర్ణపురమే’.
శరీరానికి సహజంగా శక్తి ఉండదు. మనసు ప్రేరణపైనే అది స్పష్టంగా పని చేస్తుంటుంది. మనసు ఆత్మవద్ద ఉన్నప్పుడు దానికి అపరిమితమైన శక్తి లభిస్తుంది. శరీర శక్తికే పరిమితమైన మనసు కేవలం ఆ భౌతిక దేహం బతకడానికి మాత్రమే పనికొస్తుంది. అందుకే, మనసుకు ‘శక్తి’ కావాలి. అది ఆత్మశక్తి నుండి మాత్రమే లభ్యమవుతుంది. ఈ అంశాలన్నీ ‘హనుమంతుని చరిత్ర’లో మనకు బోధపడతాయి.
నిజమే, మన మనసు కోతి వంటిది. ఇంద్రియాల చుట్టూనే తిరుగుతూ నిరంతరం ఏవో ఆగని పనులు చేద్దామని అనుకుంటూనే ఉంటుంది. ఈ శరీరం, జ్ఞాన, కర్మేంద్రియాలను వ్యర్థంగానూ ఉపయోగిస్తూ వుంటుంది. దానివల్ల శరీరం తొందరగా పాడై రోగాలకు గురవుతుంది.
హనుమంతుని వంటి ధీశాలి మార్గం అవలంబిస్తే మనకు ఎప్పటికీ తిరుగుండదు. అదే ‘ఆత్మారామ నామస్మరణ’ మంత్రం. ఈ నిరంతరానుబంధమే ‘అద్భుత శక్తి’కి మూలం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment