💥కార్తీకపురాణము - పదమూడవఅధ్యాయము💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ🌹🙏
💥కార్తీకపురాణము - పదమూడవఅధ్యాయము💥
వశిష్టుడిట్లు చెప్పెను. జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రియైన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నియు చేయదగినవి. చేయనియెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట గోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు.
కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచ మహా పాతకములు భస్మమగును.
గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును చెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు, నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు.
కార్తీకమాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖ మాసమందుగాని, ఉపనయనమును చేయించ వలయును. సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను. అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును చెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని ఎవ్వనికి సామర్ధ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు, దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన యెడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు గలుగును.
కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును, వివాహమును చేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించినవాడగును.
ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ ఒకటి గలదు, ఆ కథ చెప్పెదను సావధానుడవై వినుము.
ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై 'అర్థోవా ఏషా ఆత్మనోయత్పత్నీ' అను శ్రుత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకుబోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను.
ఆ అరణ్యమందు రాజును, భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతియాయెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆ కన్యక వృద్ధినొంది సౌందర్యముతోను, లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియై యుండెను.
ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా! నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను.
ఆమాటవిని రాజు "మునికుమారా! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈకన్యను నీకిచ్చెదను" అనెను.
ఈమాటను విని మునికుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో, "ఓరాజా! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు సుఖములను బొందగలవు" అని మునికుమారుడు చెప్పెను.
ఆమాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదను అనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదాతీరమందే తపము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి, ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తనయొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను.
ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను.రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగియొక కుమార్తెను కనెను. రాజు దానిని జూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును,దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను.
రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజుకూతురుని జూచెను. కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, "ఓయీ! నీవెవ్వడవు?ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు?చెప్పము" అని అడిగెను.
"దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగముతో సమానమయిన వియోగదుఃఖములు లేవు. దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యౌవనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంక ఏమి వినగోరితివో చెప్పుము".
ఇట్లు రాజు వాక్యమును విని యతి, "రాజా! ఎంత పనిచేసితివి? మూఢునివలె పాపములను సంపాదించుకొంటివి. కన్యా ద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. న్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడియుండలేదు. కాబట్టి ఈకార్తీకమాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము. కార్తీకమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయిన వరునకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందెడి ఫలమును పొందును".
ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో, నీచుడై ధనాశతో, "బ్రాహ్మణుడా !ఇదియేమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? నా ఈ రెండవ కూతురుని పూర్తిగా ద్రవ్యమిచ్చు వానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకెందుకు నీ దారిని నీవుపొమ్ము" అనెను.
ఆ మాటవిని యతి స్నానముకొరకు నర్మదానదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొనిపోయిరి.
అచ్చట యముడు వానిని జూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును, రాజు పితరులను గూడ పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతోగూడిన చిక్కనివనము.
ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను. స్వర్గమునకుబోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను. ఈ శ్రుతకీర్తి, సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనొందుచు ఒకనాడు, 'ఇది ఏమి అన్యాయము? పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచినారని' విచారించుకుని ధైర్యముతో యమునితో, "సర్వమును తెలిసిన ధర్మరాజా! నా మనవి వినుము. ఎంతమాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది?" అని శ్రుతకీర్తి చెప్పిన మాటలను విని యముడు పల్కెను.
"శ్రుతకీర్తీ! నీవన్న మాట సత్యమే గానీ,నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు.ఆ పాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందు ఉన్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ! సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీతీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది. దానికింకను వివాహము కాలేదు. కాబట్టి నీవు నాప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్ళి అచ్చట ఉన్న మునులతో ఈమాటను చెప్పి కార్తీకమాసమందు ఆకన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీకమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడల ధనదాతయును, లోకాధిపతియు అగును. కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును పొందును. నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము. దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు" అని పలికెను.
శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను.
ఆ పుణ్యమహిమచేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను. తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పోయిరి. తానును యథాగతముగా స్వర్గమును చేరెను.
కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనయినా వివాహమునకు సహాయము చేసిన వారి పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించు వాడు హరి సాయుజ్యమును పొందును. ఇది నిజము. నామాట నమ్ముము.
ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవ నరకమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయసమాప్తః
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment