💥దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు

 ⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏


💥దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు


వాత్సల్యంతో చేరదీసి, మంచి మార్గాన్ని చూపి, మార్గదర్శకత్వాన్ని నెరపుతూ, అవసరమైనప్పుడు తన చేయూతను అందించేవాడే సద్గురువు.


కొందరు గురువులు అత్యంత ప్రసన్నులై శిష్యులకు మార్గ దర్శనం చేస్తే, మరికొందరు అడుగడుగునా శిష్యులను పరీక్షలకు గురి చేస్తూ జ్ఞానమార్గంలోకి నడుపుతూ ఉంటారు. ఎవరి బోధనా విధానం వారిది.


ఒక్క సారి ప్రియశిష్యునిగా స్వీకరించాక ఎటువంటి పరిస్థితులలోనూ అతనిని వదలక తనంతవానిగా తీర్చిదిద్దడానికి సద్గురువు అహరహమూ శ్రమిస్తూ ఉంటాడు. అందుకు ఉదాహరణ ఋభ, నిదాఘుల వృత్తాంతం.


💥ఋభుడు బ్రహ్మ మానస పుత్రుడు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాన సంపన్నుడతడు. అతనికి పులస్త్య ప్రజాపతి కొడుకైన నిదాఘుడు అనే ప్రియశిష్యుడు ఉండేవాడు. 


గురుకృపతో నిదాఘుడు అశేషమైన విజ్ఞానాన్ని సంపాదించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన తండ్రి పులస్త్య బ్రహ్మచే నిర్మితమైన సుందర, సుసంపన్నమైన వీరనగరం అనే పట్టణంలో గృహస్థ జీవితం గడుపుతూ, ధార్మిక ప్రవృత్తితో జీవించసాగాడు.


ఇది కృత యుగం నాటి మాట ఆ కాలంలో మానవులు వేల సంవత్సరాలు జీవించేవారట. అలా ఒక వెయ్యి సంవత్సరాలు గడచిపోయాయి. 


ఒకమారు ఋభునికి తన ప్రియ శిష్యుడైన నిదాఘుడు తన బోధన వలన కలిగిన విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకొంటున్నాడో చూడాలనిపించింది. 


వీరనగరం చేరి నిదాఘుని ఇంటికి వెళ్ళాడు. చాలాకాలం గడిచిపోయింది కనుక నిదాఘుడు తన గురువును పోల్చుకోలేక పోయాడు.


ఇంటికి వచ్చిన ఋభునిని అతిథిగా భావించి, గౌరవంగా ఆహ్వానించి, అర్ఘ్యపాద్యాలు సమర్పించి, ఉచితాసనం మీద కుర్చోబెట్టి, ఆతిథ్యం తన ఇంట స్వీకరించమని ప్రార్థించాడు నిదాఘుడు.


”మీ ఇంట నాకు తినడానికి ఏమున్నది?” అని అడిగిన ఋభునికి ”పేల పిండి, కందమూలాదులతో చేసిన అప్పం వంటి పదార్థాలు” అని నిదాఘుడు చెబుతూ ఉండగానే,


”ఇటు వంటివి నేనిష్టపడను. మంచి నేతితో వండిన మధుర పదార్థాలు, గారెలు, గట్టి పెరుగు వంటివి లేవా” అన్నాడు ఋభుడు.


అతని ధాష్ణీకానికి విసుక్కోకుండా నిదాఘుడు భార్యతో రుచికరమైన వంట చేయించి అతిథికి భోజనం అమర్చాడు.


భోజనానంతరం విశ్రమిస్తున్న ఋభుని వద్దకు వచ్చి ”మహాత్మా! తమకు మా ఇంటి భోజనం సంతృప్తిని కలిగించిందా?” అని అడిగాడు.


దానికి ఋభుడు తాను నిత్య సంతృప్తుడననీ, రుచి అరుచులు; మృష్టామృష్టతలు, సుఖదు:ఖాలు తనకు చెందవు అనీ చెప్పి, ఆత్మజ్ఞానం గురించి లోతుగా వివరించాడు. 


అప్పుడు నిదాఘుడు ఆ అతిథి తన గురువైన ఋభుడే అన్న ఎరుక కలుగగా, తనకు ఆత్మజ్ఞానాన్ని బోధింప వచ్చిన ఆయన శిష్యవాత్సల్యానికి కరిగిపోయాడు. కాలక్రమంలో మరో వెయ్యి సంవత్సరాలు గడిచి పోయాయి.


తాను బోధించిన ఆత్మజ్ఞానం శిష్యునిలో ఎంత పరిపక్వ స్థితికి వచ్చిందో తెలుసుకోడానికి ఋభుడు మరలా వీర నగరానికి వచ్చాడు.


అప్పుడు ఆ నగరంలో మహారాజు పట్టపుటేనుగు మీద కూర్చొని ఊరేగుతున్నాడు. తన ఇంటికి కావలసిన వంటచెరకును అడవిలో సేకరించి తీసుకొని వెడుతున్న నిదాఘుడు ఆ కోలాహలం సద్దుమణిగే దాకా రహదారి ప్రక్కన ఆగి ఉన్నాడు.


ఒక అమాయకుడైన పల్లెటూరివాని లాగా అతని దగ్గరకు పోయి ఋభుడు ”ఏమిటి ఆ కోలాహలం” అని అడిగాడు.


”మహారాజు ఏనుగు అంబారీపై ఊరేగుతున్నారు చూడు” అని బదులిచ్చాడు నిదాఘుడు.


”అవునా! ఈ మందలో మహారాజెవరు?” అన్నాడు ఋభుడు. ”అదిగో! ఆ ఏనుగుపైన ఉన్నవాడు రాజు” అని సమాధానమిచ్చాడు నిదాఘుడు.


”అయ్యో, నాకు అన్ని ఆకారాలు ఒకటిగానే కనిపిస్తున్నాయి. అందులో రాజెవరు? ఏనుగు ఎవరు?” అని అడిగాడు ఋభుడు మళ్ళీ.


నిదాఘుడు ఎంతో ఓపికతో ”పైన కూర్చున్నవాడు రాజు. అతని కింద ఉన్నది ఏనుగు” అంటూ వేలితో చూపాడు. 


”సరిసరి. తెలిసిందిలే. కానీ పైన, క్రింద అంటే ఏమిటి?” అని మళ్ళీ ఋభుడు అడిగేసరికి చిర్రెత్తి ఋభుని మెడ వంచి, అతనిపైకి లంఘించి కూర్చుని ”నేనున్నది నీపైన, నీవున్నది నా కింద” అన్నాడు నిదాఘుడు. 


”బాగుంది. పైన, క్రింద అంటే తెలిసింది. కానీ, ‘నేను’ ‘నీవు’ అన్నావే. అంటే ఏమిటి?” అని ఋభుడు అనగానే...


తనను ఇంతవరకు ప్రశ్నిస్తున్నది తన గురువేనని అర్థమై ఆయన పాదాలపై పడి పోయాడు నిదాఘుడు. అతనికి అద్వైతాన్ని బోధించి వెళ్ళి పోయాడు ఋభుడు.


విష్ణుపురాణం లోని ఈ గురుశిష్యుల గాథను భగవాన్‌ శ్రీరమణ మహర్షి తన శిష్యులకు చెప్పగా విని ఆ విషయాన్ని కె.లక్ష్మణ శర్మ ‘మహాయోగ’ అనే ఆంగ్ల గ్రంథంలో పేర్కొన్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు