💥భాద్రపద శుద్ధ ద్వాదశి – వామన_జయంతి💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥భాద్రపద శుద్ధ ద్వాదశి – వామన_జయంతి💥
శ్రీ మహావిష్ణువు “వామన మూర్తి” గా ఈ భువిపై అవతరించిన రోజు “వామన ద్వాదశి” లేదా “వామన జయంతి” అని అంటారు.
బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. (ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుడి కుమారుడే ఈ బలి చక్రవర్తి), గొప్ప దానవ వీరుడు మరియు అపర దానశీలి. దానవ వంశములో జన్మించినా ఎన్నో దాన ధర్మాలు, అశ్వమేధ యాగాలు చేసాడు మరియు ధర్మ బద్ధంగా రాజ్య పాలన చేసాడు.
ఒకనాడు బలి చక్రవర్తి తన కులగురువైన శుక్రాచార్యులు తనకై చేసిన ”విశ్వజిత్ యాగ” ఫలితంగా దివ్య ధనస్సు , అక్షయాలైన అమ్ముల పొది, బంగారు రథం, దివ్య కవచం పొంది దానవ సైన్యంతో ఇంద్రలోకం మీద దండయాత్ర చేసి ఇంద్రున్ని జయించి ఆ లోకాన్ని కైవసం చేసుకుంటాడు.
రాక్షసుల ధాటికి దేవతలు భయపడి పోయి చెల్లాచెదురై పోయారు. ఇంద్రుడిరాజధానిని బలి చక్రవర్తి ఆక్రమించాడు.
"శుక్రాచార్యుడు విశ్వజిత్తనే యాగం జరిపించి రాక్షసులకు ఎంతో శక్తిని సంపాదించి పెట్టాడు. వాళ్ళనిప్పుడు జయించడం చాలా కష్టం. మంచి రోజులు వచ్చేంత వరకు మీరెక్కడైనా తలదాచుకొని కాలం గడపండి” అని హితవు చెప్పాడు దేవతల గురువైన బృహస్పతి.
తన బిడ్డల దుస్థితికి కశ్యప ప్రజాపతి భార్య అదితి బాధపడగా, భర్త కశ్యప ప్రజాపతి చెప్పినట్లు పయోవ్రతాన్ని ఆచరించి, వాసుదేవుని ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు సాష్షాత్కరించాడు.
అదితికి పుత్రుడై పుట్టి దేవతలకు మేలుచేస్తానని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు శ్రీమహావిష్ణువు.
ఇలా ఆ శ్రీమహావిష్ణువు అదితి గర్భాన భాద్రపద శుధ్ధ ద్వాదశినాడు శ్రవణా నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో వామన మూర్తిగా జన్మించాడు. ఇలా ఇంద్రుడికి సోదరుడై జన్మించాడు కనుక ఆ స్వామికి “ఉపేంద్రుడు” అని పేరు.
పుట్టగానే ఆ స్వామి బాల వటువు రూపం స్వీకరంచాడు. మహర్షులు వామనుడైన ఆ వటువుకు ఉపనయనాది సంస్కారాలుగావించారు.
బృహస్పతి యఙ్ఞోపవీతాన్ని ఇచ్చాడు. భూమి కృష్ణాజినాన్ని, సోముడు దండాన్ని, తల్లి అదితి కౌపీనాన్ని, బ్రహ్మ కమండలాన్ని, సప్తరుషులు దర్బలను, సరస్వతి అక్షర మాలను, కుబేరుడు భిక్ష పాత్రను ఇచ్చాడు. పార్వతి భిక్ష ఇచ్చింది.
వామనుడు బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తూ బలి అశ్వమేధ యాగం చేస్తున్న యాగశాల వద్దకి వస్తాడు. అ స్వామీ ముగ్ధమోహన రూపానికి బలిచక్రవర్తి సహా అందరు మంత్రముగ్డులైనారు. బాల బ్రహ్మచారి మరియు బ్రాహ్మణుడు కనుక బలి తానే స్వయంగా వెళ్లి ఆ స్వామిని సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తాడు.
తరువాత వామనుడు బలిని కేవలం మూడడుగుల స్థలాన్ని దానంగా కోరుకుంటాడు.
కాని వచ్చినది సామాన్య బాలకుడు కాదు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అని శుక్రాచార్యుడు గ్రహించి ఆ దానము చెయ్యకూడదని అది తనకే అపాయమని బలిని
హెచ్చరిస్తాడు!!
కాని బలి సిరిసంపదలు శాశ్వతం కాదు కీర్తి ఒక్కటే శాశ్వతం అని అందునా వచ్చినది సాక్షాత్తు శ్రీహరి, అంతటి దేవదేవుడికే దానమిచ్చే అవకాశం, భాగ్యం కలిగి నందుకు బలి ఆనందంతో దానానికి సిద్ధపడతాడు.
వెంటనే తన భార్య వింధ్యావళి సువర్ణ కలశంతో జలం పోస్తుండగా వామనమూర్తి పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సు మీద ప్రోక్షించుకొన్నాడు బలి. ఆ సమయంలో
ఆకాశం నుండి పూలవాన కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. బలి చక్రవర్తి దానగుణాన్ని లోకాలన్నీ ప్రకాశించాయి.
బలి, వామనమూర్తి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా శిష్యునిమీద వాత్సల్యంతో శుక్రాచార్యుడు దాన జలధార వామనుని చేతిలో పడకుండా పురుగు రూపంలో కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడు.
వామనుడు అది గ్రహించి కలశ రంధ్రంలో దర్భతో పొడిచాడు. శుక్రాచార్యుడికి అప్పటినుంచి ఒక కన్ను పోయింది.
అప్పుడు స్వామి తనని తానూ విస్తరించుకుంటూ ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు!!
ఒక విధంగా స్వామి తన విరాట్రూపాన్ని చూపాడు. ఒక పాదంతో భూమండలాన్ని , రెండవ అడుగుతో సత్య లోకాన్నిి దాటి ఆకాశాన్ని పూరించాడు.
అప్పుడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మ ఆ స్వామి వారి పవిత్ర పాదాలని తన కమండలంలోని నీటితో కడిగి అభిషేకిస్తాడు. దీనినే అన్నమయ్య తన కీర్తనలలో “బ్రహ్మ కడిగిన పాదము” అని కీర్తించాడు.
ఇలా ముల్లోకాలని మించి విస్తరించాడు కనుకనే స్వామిని “త్రివిక్రముడు” అని పిలుస్తారు.
ఇక మూడవ అడుగు ఎక్కడ అని అడుగగా, బలి ఆ స్వామికి సంపూర్ణ శరణాగతుడై తన శిరస్సును చూపించి తనని తాన స్వామికి అర్పించుకుని ఆత్మనివేదనం చేసాడు.
భక్తులకి భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఆరాధన ఉంటుందో అలానే భగవానునికి భక్తుని యెడల అంత కంటే పలు రెట్లు ఎక్కువ ప్రేమ ఉంటుంది!!
ఇంతగా బలి చక్రవర్తి తనని తాను అర్పించుకున్నందుకు ఆ స్వామి బలిని సుతల లోకానికి అధిపతిని చేసాడు అంటే కాదు ఆ లోక ద్వార పాలకుడిగా, రక్షకుడుగా ఉన్నాడు ఆ స్వామి!! ఇదీ ఒక శ్రేష్టమైన భక్తుని పట్ల భగవంతుడు చూపే కరుణ మరియు కృపాకటాక్షాలు!!
ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన
పదనఖ నీరజ నతజన పావన
కేశవ ధృత వామన రూప జయ జగదీశహరే!!
ఈ వామనావతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment