💥దత్తాత్రేయ అవతారంలోని ఆంతర్యం ఏమిటి?

 ⚜️🕉️🚩ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః


💥దత్తాత్రేయ అవతారంలోని ఆంతర్యం ఏమిటి?


మనం భగవంతుడి అవతారాలన్నీ నిశితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి.

ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి.

కానీ దత్తాత్రేయ అవతారం అలాకాదు.

ఆయన ఆవిర్భావం వెనక ఒక నిగూఢమైన, నిరంతరాయమైన కార్యక్రమం ఉంది.

మనుషుల్లో జ్ఞాన, వైరాగ్య, ఆధ్యాత్మికోన్నతి కలిగించడం అనే ముక్కోణ ప్రణాళిక ఉంది.

అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది.  


సత్త్వ, రజో, తమో గుణాలను జయించిన మహా తపశ్శాలి అత్రి మహాముని.

అసూయ లేని సాధ్వీమణి అనసూయ.

ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణిమనాడు దత్రాత్రేయుడు జన్మించాడు. 


దత్తుడు జ్ఞానానికి ప్రతీక.

ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు.


ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకార‌ మమకారాలే రాక్షసులు. మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి.

అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి, జ్ఞానదీపాలు వెలిగించాడు. 


సాక్షాత్తు దైవం గురువుగా మారితే, మానవుడికి ముక్తి మార్గాన్ని చూపితే... జ్ఞాన దీపాలు వెలుగుతాయి, చిమ్మ చీకట్లు తొలగుతాయి.


💥అసలు దత్తాత్రేయుడి పేరులోనే ప్రత్యేకత ఉంది.

దత్తం అంటే త్యజించడం అనే అర్థముంది.

సూక్ష్మ, స్థూల, కారణాలనే మూడు రకాల శరీరాలను,  జాగృత్‌, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులను, సత్త్వ, రజో, తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు. 


మహా యోగీశ్వరుడైన దత్తుడు జగదాచార్యుడు కూడా.. సకల లోకాలకు గురుమూర్తి.

మిగిలిన భగవదవతారాల్లో దైవత్వం మాత్రమే దర్శనమిస్తుంది.

కానీ దత్తావతారంలో మాత్రమే దైవలక్షణాలతో పాటు గురులక్షణాలు కూడా కనిపిస్తాయి. 


సృష్టిలోని ప్రతి ప్రాణినీ గౌరవించాలి.

రూపభేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసుకి లేదు. ప్రతి ప్రాణి హృదయంలో ఉండే భగవంతుడు ఒక్కడే. ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శించగల స్థాయికి చేరుకోవాలి.

ప్రకృతి వైవిధ్యం విలసిల్లేలా మన కార్యకలాపాలు ఉండాలి.


అనంతమైన ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి మనం గ్రహించాల్సిన అంశాలెన్నో ఉంటాయి.

రూపం వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలని ప్రకటించటమే ప్రకృతిలోని వివిధ విషయాలను దత్తుడు గురువులుగా స్వీకరించటంలో ఉన్న అంతరార్థం.


💥సాధారణంగా దత్తాత్రేయుడి రూపం మూడు ముఖాలు, వెనుక వైపు గోవు, ముందుభాగంలో శునకాలు ఉండే సన్నివేశంతో కనిపిస్తుంది.


బాహ్యదృష్టిలో ఇవన్నీ ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలు.

కానీ, దత్తాత్రేయుడి రూపం మనిషికి కర్తవ్యపూరితమైన సందేశాన్నిస్తుంది.


దత్తాత్రేయుడి మూడు ముఖాలు భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాలకు సంకేతంగా నిలుస్తాయి.

గతాన్ని పునాదిగా చేసుకుని, వర్తమానానికి అనుగుణంగా జీవిస్తూ, భవిష్యత్‌కు బాటలు పరుచుకోవాల్సిన కర్తవ్యం మనిషికి ఉంది.

మూడు ముఖాల దేవుడు అందించే మహోన్నత సందేశం ఇది. 


దత్తుడి వెనకాల గోవు ఉంటుంది.

గోవు ప్రకృతికి సంకేతం.

మనిషి ప్రకృతికి బద్ధుడుగా జీవించాలి.

ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే సందేశం గోవు ఇస్తుంది.

దత్తుడిని అనుసరించి ఉండే శునకాలు భూతదయకు సంకేతాలు.   


💥దత్త  జ్ఞాన బోధ


మనిషి అభివృద్ధి చెందాలంటే శ్రద్ధతో పాటు దృఢమైన విశ్వాసం కావాలి.

మనం విశ్వాసాన్ని ఆధారంగా తీసుకుని జీవించాలి. 


అవసరమైన సమయంలో సహాయం అందుతుందనే నమ్మకం మనలో నిరంతరం ఉండాలి.

దానివల్ల ఒకవిధమైన భద్రతా భావన కలుగుతుంది.

అదే ఆత్మవిశ్వాసం అవుతుంది.


శక్తి హీనమైన జ్ఞానం నిర్లిప్తతతకు దారితీస్తుంది.

జ్ఞాన హీనమైన శక్తి వినాశనానికి కారణమవుతుంది. అందువల్ల మనిషి జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి.

ఆ తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి. 


ఆనందం అనేది పరమేశ్వరుడికి సంబంధించిన విషయం. పారవశ్యం యోగికి కలిగే అనుభవం.

అసలు కోరికలు లేనివారికి కలిగేది హర్షం.

సమస్త జీవులకు అందుబాటులో ఉంది సుఖం.

అయితే దానితో పాటు దుఃఖం కూడా ఉందని గుర్తించాలి.

అందుకే సుఖం కలిగితే పొంగిపోవద్దు. దుఃఖంలో కుంగిపోవద్దు. అంతా దైవేచ్ఛగా భావించాలి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి