🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱🙏
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱🙏
🏵️🌼🏵️🌼🏵️
💥అనగనగా ఓ ఇంటాయన... ఇంటావిడ.
ఆయనేమో మహా భోళా...
ఆవిడేమో ఆయన అడుగు జాడ...
దేవతలు వచ్చి విషం చేతికిచ్చి... 'అయ్యా! ఇది మమ్మల్ని దహించి వేస్తోంది. లోకం సర్వనాశనమవుతోంది. మీరే ఆదుకోగల సమర్ధులు. జన సంరక్షణలో మీదే మొదటి స్థానం' అని పొగిడారు.
ఆయన అంత కాలకూటాన్నీ నేరేడు పండులా అరచేతిలోకి తీసుకున్నాడు.
ఒక్కసారి భార్య ముఖంలోకి చూశాడు.
ఆ తల్లి వద్దనలేదు.
'ప్రజల క్షేమం కోసమే కదా. ఫర్వాలేదు. మింగెయ్యి...' అందావిడ మంగళసూత్రాన్ని ఓసారి కళ్లకద్దుకుని.
ఈ సన్నివేశానికి అద్భుతమైన పద్యరూపాన్నిచ్చాడు మహాకవి పోతన.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
ఆమెను సర్వ మంగళ అనడంలో ఉంది ఆయువుపట్టు.
పుస్తెలతాడు మీద ఆమెకు ఎంత నమ్మకమో... అనేది పైకి కనిపించే అర్థం.
కానీ సూత్రం అనే మాటకు సిద్ధాంతం అనే అర్థం కూడా ఉంది. లోకాలన్నీ సురక్షితంగా ఉండాలన్నది ఆమె సూత్రం.
మంగళకరమైన ఆమె భావనల కారణంగానే ఆమె సర్వమంగళ అయింది.
ఇదీ పార్వతీపరమేశ్వరుల త్యాగసంసిద్ధత.
ఇంత త్యాగం ఎందుకంటే... వారిద్దరూ ఈ జగత్తుకే తల్లిదండ్రులు కాబట్టి...
'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అన్నాడు
కాళిదాస మహాకవి.
ఎప్పుడు పుట్టారో తెలియని ఆది మహా దంపతులు వారు. ఆయన భక్తవశంకరుడైతే... ఆమె కారుణ్య శాంకరి.
💥ఒంటి నిండా బూడిదపూత, మెడలో కాలసర్పం, కంఠానికి కంకాళాల దండ, దేహానికి జంతుచర్మం!
ఇదీ ఆ పెద్దాయన స్వరూపం.
భీకరమైన ఆ రూపమే లోకానికి పరమ ప్రీతికరం.
ఆయన సకల జంతుకోటికీ ఆరాధ్య దైవం.
స్వభావరీత్యా ఆయన భక్త సులభుడు.
సాలె పురుగు ఏ వేదాలూ చదవలేదు. నాగుపాము ఏ శాస్త్రాలూ మధించలేదు. ఏనుగు చదువులెంతో ఎవరికీ తెలియదు.
ఏ మంత్రం తెలియని కన్నప్ప పరమేశ్వర సాయుజ్యాన్ని పొందాడు. అదే శివ కారుణ్యం.
నీలకంఠుని శిరస్సుపై ఇన్ని నీళ్లు చల్లి.. కాసింత పత్రి భక్తితో అర్పిస్తే చాలు వరాల కల్పవృక్షాన్ని పెరట్లో పాతేసుకోవచ్చు. అంత భక్త సులభుడాయన.
💥దైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలకు ముందు ధ్వజారోహణం ఉంటుంది.
శైవక్షేత్రాల్లో నంది ధ్వజాన్ని ఎగరేస్తారు.
శ్రీకాళహస్తిలో ఇంకో పరమ విశేషం ఉంది.
ఏటా శివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవాల్లో ద్వజారోహణం స్వామి కొలువుదీరిన ఆలయం వద్ద కాకుండా భక్తకన్నప్ప నివాసమైన కొండమీద జరుగుతుంది.
దేవుడికి సమర్పించే ధ్వజారోహణ కైంకర్యం భక్తుడి ముంగిట జరగడం ఆ పరమేశ్వరుడి దయావీక్షణాలను చాటుతుంది.
💥ధీ అంటే బుద్ధి... యానం అంటే ప్రయాణం... బుద్ధితో కలిసి ప్రయాణించడమే "ధ్యానం"
తుమ్మెదలు తమ చుట్టూ తిరిగే కీటకాలన్నిటికీ తమ లక్షణాన్నే ఆపాదిస్తాయి. దాన్నే "భ్రమర కీటక న్యాయం" అంటారు.
శివభక్తి కూడా అలాంటిదే.
బుద్ధిని శివుడిలో నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తు శివుడే అవుతాడని చెబుతారు పెద్దలు.
ఆయన భోళా శంకరుడు... కోరినవన్నీ ఇచ్చేస్తాడు. ఆయన భక్తవశంకరుడు... ఇట్టే కరిగి భక్తుల ముందు వాలిపోతాడు.
అంతేనా... ఈ విశ్వంలోని అణువణువూ ఆయన చైతన్యానికి నిదర్శనమే.
ప్రతి కదలికా ఆయన తాండవమే.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment