💥జ్యోతిర్మయ స్వరూపమే శివుడు:

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱

🏵️🌼🏵️🌼🏵️


వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం

వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధ గంగాధరమ్!

వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్!!


💥శివుడు సకల జగాలకు పాలకుడు.

లోకాలకు శోకాలను తొలగించి శుభాలనిచ్చే దేవుడు.

ఈ చరాచర జగత్తును లయం చేసేవాడు.

జఢమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే 'లయ'కారకుడు. 


శివుడు భక్త సులభుడు. భోళా శంకరుడు.

అభిషేక ప్రియునిగా భక్తులచే పూజలందేవాడు.

పరమేష్ఠిగా పూజలందే శంకరుడు స్థిరుడు, అద్వితీయుడు.


సర్వమయుడు, సర్వసృష్టికి ఆదియైనవాడు.

జగతికి అది గురువు దక్షిణామూర్తిగా జ్ఞాన బోధ చేసిన అఖండ విజ్ఞానస్వరూపుడు, మోక్షకారకుడు. వేదమయుడు, వేదవిభుడు, ఇంద్రాద్రి దేవతలచే సైతం తెలుసుకోలేని అనంత తత్వమయుడు.


'శివా' అని భక్తితో అన్నంతనే భక్తులను బ్రోచే శంకరుడు భక్తవశంకరుడు.

తనువును పులకింపచేసేది, మానవకోటికి మోక్ష మార్గదర్శిని అయినది 'శివ పంచాక్షరి'

పరమ మంత్రమైన 'ఓం నమశ్శివాయ' అనే చిన్న జపంతో, నిరంతర తపంతో సాధ్యం కాని మహాకార్యాలు సైతం మనకు సులభంగా సాకారమవుతాయి. 


చైతన్యానికి మూలబిందువైన ప్రణవం శివ-శక్తి సమన్వితం.

అంటే ప్రకృతి పురుషుల సమైక్య శక్తి.

ఆ ప్రణవ ఓంకారం నుంచే పంచాక్షరి ఆవిర్భవించింది.


💥జ్యోతిర్మయ స్వరూపమే శివుడు:


శివారాధన హైందవ సంస్కృతిలో అంతర్భాగమై, భక్తజనుల భాగ్యమై చిరకాలంగా నిలిచి ఉంది.

జనుల హృదయాలలో ఉన్న తమస్సును తొలగించే జ్యోతిర్మయ స్వరూపునిగా శివుడు జ్యోతిర్లింగాలలో కొలువై ఉన్నాడనేది ఐతిహ్యం.


శివునికి అత్యంత ప్రీతిపాత్రమై, మోక్షధామాలుగా వాసికెక్కినవి విశాల భారతావనిలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలు.

జ్యోతిర్లింగాలూ, మన రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలే గాక, ఊరూరా, వాడవాడలా వ్యాపించిన శివాలయాలలో శివపూజలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 


శివుడు నిరామయుడు. నిరాడంబరుడు.

భస్మాన్ని పూసుకునే అలంకారాన్ని కలిగినవాడు కాబట్టే భస్మ భూషితాంగుడని పిలువబడ్డాడు.


రౌద్రమయ స్వరూపంగా భాసించేవాడు కాబట్టి రుద్రునిగానూ దేవతలలో ప్రసిద్ధుడు.


శివుడు చంద్రుని శిరస్సున దాల్చి 'చంద్రమౌళి'గా పూజించబడుతున్నాడు.


💥గరళకంఠుడు:


సృష్టి మేలుకోసం తానే సర్వమూ అయ్యే సర్వాత్ముడు శివుడు.

అమృతోత్పత్తి కోసం దేవతలు, దానవులు అత్యంత ఉత్సాహంతో క్షీరసాగర మథనంలో పాలు పంచుకున్నప్పుడు ముందుగా ఆవిర్భవించింది 'హాలాహలం'.


గరళాన్ని సేవించి స్థిరంగా తనలో నిలుపుకోగల మహితమైన దైవం శివుడే అని తలచిన దేవదానవులు పాపహరుడైన హరుని ప్రార్థించగానే చిరునవ్వుతో ఆ కాలకూట విషాన్ని తన గొంతులో నింపుకుని గరళకంఠుడయ్యాడు స్వామి.


ఈ మహత్తర కార్యంతో లోకాలకు ఎటువంటి కీడూ వాటిల్లకుండా చేసిన వాత్సల్య సింధువు నీలకంధరుడు.


💥పంచభూతాల్లో ముఖ్యమైనది, ప్రాణికోటికి అత్యంత ఆవశ్యకమైనది జలం.


భగీరధుడు దివి నుంచి భువికి గంగను తీసుకు వచ్చినప్పుడు బిరబిర జరజర దూసుకువచ్చే గంగమ్మను క్షణాన నిలువరించి, విశేషమైన జలధారలను తాను ఒడిసిపట్టి, ఆ వేగాన్ని అదుపుచేసి, తగినంతగా ఆ జలధారలను భూమి మీదకు వదిలి భూమి మీద జీవులకు ప్రాణాధారమైన జలాన్ని అందించడమే ఆ శివమూర్తి అపారమైన కారుణ్యానికి ఉదాహరణ. 


ఈ జగాన మహోన్నతమైన శక్తిగా మహేశ్వరుడు లింగాకృతిలో ఆవిర్భవించిన బృహత్సమయమే మహాశివరాత్రిగా వాసికెక్కింది.


మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయాన ఆవిర్భవించిన ఆ దివ్యఘడియలే మహాశివరాత్రిగా ప్రసిద్ధమైనదే గాక, ఆ పుణ్య ఘడియలలో శివుని అర్చించి పూజించిన వారికి కైవల్యం ప్రాప్తిస్తుందని సాక్షాత్తూ శివుడే అనుగ్రహించినట్లు శివపురాణం స్పష్టం చేస్తోంది.


శివునికి నిష్ఠతో మహాశివరాత్రి పుణ్యదినాన అభిషేకాన్ని పవిత్రజలంతో నిర్వహించి, బిల్వపత్రంతో పూజిస్తే పునర్జన్మ ఉండదనేది పురాణ ప్రోక్తంగా చెప్పబడింది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి