నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకోవలసిన అతి గొప్ప లక్షణం "స్థితప్రఙ్ఞత్వం"
⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
యావత్ స్థాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే!
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతే!!
పర్వతాలు, నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామ కథ నిలిచి ఉంటుంది అని బ్రహ్మ అంటారు.
మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలిసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది ఈరోజుల్లోనే.
రామ కథా శ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం.
రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచీ మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంత కంటే ముఖ్యం.
💥లీలా నాటక సూత్రధారి, జగదానందకారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణార్థము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థము అనేక అవతారాలు ధరించాడు.
రావణ కుంభకర్ణుల వధానంతరం కూడా సుదీర్ఘకాలం పృథ్వి పైన జీవించి మానవాళికి జీవన మార్గాన్నీ, ఆదర్శ జీవన విధానాన్ని తన జీవితమే ఉదాహరణంగా దర్శింపజేసిన అవతారం శ్రీరామావతారం.
అద్భుతమైన, ఆదర్శవంతమైన గుణాలు కల రాముడు ఎక్కడా తాను భగవంతుడనని చెప్పుకోలేదు.
ఇతరులు ఎవరైనా నీవు భగవంతుడివి అన్నా
"ఆత్మానం మానుషం మన్యే" -
నేను సాధారణ మానవుడిని అని నిక్కంగా పలుకుతాడు.
బ్రహ్మ ఇచ్చిన వరాల బలం వల్ల రావణ వధ దేవ, దానవ, యక్ష, సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని.
నర వానరుల పట్ల రావణునికి ఉన్న తేలిక భావం కారణంగా వారి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూలేదు, బ్రహ్మ ఇవ్వనూ లేదు.
అందువల్ల నరుడుగా జన్మించి, నరుడుగా వ్యవహరించినపుడు మాత్రమే శీమహావిష్ణువుకైనా రావణుని చంపడం సాధ్యమౌతుంది.
ఇందుకొరకు వానర రూపంలో జన్మించిన దేవతా గణాల సహాయం తీసుకొని రావణుని వధించవలసి వచ్చింది.
💥మామూలుగా ఐతే రావణ సంహారంతో కథ ముగిసిపోయి అవతార పరిసమాప్తి జరగాలి కదా, కానీ అలా జరగలేదు.
దశరథుని పుత్రకామేష్టి యాగానికి వచ్చిన దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు, తాను దశరథాత్మజునిగా జన్మించి "దశవర్ష సహస్రాణి, దశవర్ష శతానిచ" అనగా పదకొండువేల సంవత్సరాలు మానవునిగా జీవిస్తానని ప్రకటిస్తాడు.
ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది అన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి.
ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శమానవుడు ఎలా ప్రవర్తించాలి?
నరుల పట్ల ఉన్న తేలికభావం తొలగించాలన్నా, ఆదర్శ మానవ సంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది.
అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం.
💥చాలా చిన్న కారణాలకే కుంగిపోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకోవలసిన అతి గొప్ప లక్షణం "స్థితప్రఙ్ఞత్వం"
ఈ రోజు ఉదయం తండ్రి పిలిచి "రామా రేపే నీ పట్టాభిషేకం నీవు, నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి" అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో...
ఆరోజే రాత్రి కైకేయి పిలిపించి, రామా! మీ నాన్న చెప్పలేకపోతున్నారు. నీవు అంగీకరిస్తావో లేదో అని భయపడుతున్నారు. నీకు పట్టాభిషేకం చేయడంలేదు, రేపటి నుంచీ నీవు జటాధారివై, మునివృత్తి స్వీకరించి 14 సంవత్సరాలపాటు వనవాసం చేయాలి అని చెప్పినపుడూ అంతే సహజంగా నిర్వికారంగా స్వీకరించాడు.
తల్లి పైన గానీ తండ్రి పైన గానీ ఆవేశపడిపోయి, తల్లితండ్రులను శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే కాక, ఆవేశపడుతున్న లక్ష్మణుడిని మందలించి అరణ్యవాసానికి చాలా హాయిగా సిద్ధపడిపోయాడు.
💥దేశభక్తి మాతృభక్తి కూడా రాముని చూసి నేర్చుకోవాలి.
రావణసంహారం తరువాత లంకా నగరంలో సంచరిస్తూ లంకా నగర సౌందర్యానికి ముగ్ధుడైన లక్ష్మణునితో రాముడన్న మాటలను ఒక్క సారి గమనిద్దాం:
"అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"
బంగారంతో నిండినదైనా నాకు లంకా నగరం రుచించదు లక్ష్మణా, జననీ జన్మభూములు స్వర్గం కంటే గొప్పవి అన్నమాటలు రాముని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ఇంతకుమించిన దేశభక్తి, జాతీయతా భావన మరెక్కడ కనిపిస్తాయి?
💥#కృతఙ్ఞత గుణం మానవునికి వుండవలసిన ఉత్తమగుణాలలో ప్రధానమైనది.
ఈ గుణం రామునిలోపుష్కలంగా దర్శనమిస్తుంది.
పరిస్థితుల ప్రభావం వల్ల తండ్రికి దహనసంస్కారం కూడా చేయలేక పోతాడు రాముడు.
తనభార్య సీతను రక్షించడంకోసం రావణునితో పోరాడి కొస ప్రాణాలతో మిగిలి ఉన్న జటాయువు పట్ల కృతఙ్ఞతా భావంతో రాముడు జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు.
ఇదీ కృతఙ్ఞతా గుణం అంటే.
మనకు ఏ చిన్న ఉపకారం చేసినవారిని కూడా మరచి పోకుండా వారికి అవసరమైనపుడు ప్రతి సహాయం చేయగలిగే సంస్కారం రాముని దగ్గరే నేర్చుకోవాలి.
💥మనలను ఆశ్రయించి #శరణు కోరిన వారిని పరిత్యజించకుండా శరణు ప్రసాదించడాన్ని వ్రతంగా కొనసాగించినవాడు రాముడు.
చంపదగినట్టి శత్రువు రావణుని సోదరుడైన విభీషణుడు తనను శరణు కోరి అర్థించినపుడు, (హనుమంతుడు తప్ప మిగిలిన) వానర ప్రముఖులు అనుమానించినా, ఎట్లాంటి సంశయం లేకుండా అతనికి శరణు ప్రసాదించి, రావణుడే కోరినా శరణమిస్తానని అంటాడు.
ఈ మాటలు రాముడు తప్పించి ఇంకొకరు పలకలేరేమో. అందుకే "శరణాగత త్రాణ బిరుదాంకితుడవు" అని కీర్తిస్తాడు రామదాసు.
నాటికీ, నేటికీ, ఏనాటికీ రాముని శీలసంపద, గుణ సంపత్తి, అగాధమైన అమృతసాగరం.
సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment