💥పోలిస్వర్గం (పోలి పాడ్యమి)

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥పోలిస్వర్గం (పోలి పాడ్యమి)

    

స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో "పోలి స్వర్గం" నోము ఒకటి.


కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి..

నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి..

అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసినులో నీళ్ళు పోసి కాని దీనిని వదులుతూ ఈ కధను చదువుకోవాలి.

తరువాత కథ అక్షింతలు తల మీద వేసుకోవలను.


💥పోలి స్వర్గం కథ:


పూర్వం కృష్ణాతీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది.

ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట.

వారిలోని చిన్నకోడలే పోలి.

ఆమెకు చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి.

కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది.


తనలాంటి మహా భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం.


అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది.


ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేది.


అయితే, పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు.

పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి, కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది.


ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా దానిపై మేదరబుట్టను బోర్లించేంది.

ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి.

చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. 


కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది.


వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది.

కానీ, పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి, కార్తీక దీపాన్ని వెలిగించింది.


ఎన్ని అవాంతరాలు ఎదురై, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు.

వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు పుష్పవిమానం దిగి వచ్చింది. 


అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె మిగతా కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు.

కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు.


ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. 


విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు.

🍁🍁🍁🍁🍁


💥చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని "పోలి పాడ్యమి" అంటారు.


💥కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేక పోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే...

ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది.


💥పొలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలిస్వర్గం నోము కధ.


కార్తీక మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలి స్వర్గం కథ కూడా ఒకటి.


కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ తెలియజేస్తుంది.


💥ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని,

భగవంతుని కొలవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదు...


అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని పోలి స్వర్గం కథ చెబుతుంది.


అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది.

అందుకే కార్తీకమాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి