ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ ।
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥
మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. "దత్తం" అంటే ఇచ్చినవాడని అర్ధం. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. అలా దత్తాత్రేయడనే నామంతో ప్రసిద్ధి చెందారు. దత్తాత్రేయ స్వామి ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడనేది పురాణాలు చెబుతున్న మాట.
దత్తాత్రేయ స్వామి ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించారు. కార్త్య వీర్యార్జునుడు, పరశు రాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించిన గురువు దత్తాత్రేయ. ఈయన అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించారు.
దత్తాత్రేయుని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము లేనిది. మనసుతో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.
దత్తుని రూపంలో అంతరార్థం విషయానికొస్తే.. శ్రీ దత్తాత్రేయ స్వామి మూడు తలలతో ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు ఈయన రూప రేఖ లావణ్యాలుంటాయి.
దత్తాత్రేయ స్వామి మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులులకు ప్రతీతి. సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
ఈయన చుట్టు ఉండే నాలుగు కుక్కలు: నాలుగు వేదములు. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడిగా ప్రసిద్ధి చెందారు.
ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖ దుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
మాల: అక్షరమాల, సర్వమంత్ర యము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు, సంగీత, సాహిత్యములకు మూలము.
త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకనం, సామర్థ్యము, వివేకమును సూచిస్తుంది.
డమరుకం: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
కమండలము: సమస్త బాధలను పోగొట్టేది. శుభములను సమకూర్చేది.
దత్తాత్రేయ గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి కూడా. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోక గురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేసిన మహాజ్ఞాని. జాతి శ్రేయస్సు కోసం జ్ఞానబోధ చేశాడు.
దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణ మూర్తిగా కీర్తింపబడుతున్నాడు. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు.
భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు దత్తాత్రేయ స్వామి. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి నేర్చుకోవాలన్నారు.
ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలని చెప్పారు. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి చెప్పారు. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి చెప్పారు. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలని చెప్పారు.
చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కానీ ఆత్మకు కావని గ్రహించాలని చెప్పిన గొప్ప గురువు. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలని చెప్పాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!
దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు
దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయని ప్రతీతి. దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" లో చెప్పబడింది.
దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్రేం చేతనే సంతుష్టుడు అవుతాడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకం.
దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment