మాఘపురాణం - 26వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥 మాఘపురాణం - 26వ అధ్యాయము
సుధర్ముడు తండ్రిని చేరుట
ఆ బాలుని జాతక ప్రభావము ఎటువంటిదో ! అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసిమొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై పడినందున ఆ రాత్రి అతనికే అపాయము కలుగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయము లేచి అడవిలో ఏకాంతముగా ఉన్నకారణము చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుతున్నాడు.
అలా పెరుగుతూ పన్నెండేళ్ళ ప్రాయము వాడయ్యాడు. ప్రతి దినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడు తండ్రీ! అనాధరక్షకా!” అని ప్రార్థిస్తూ, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను ఎందుకు బ్రతికడము?” అని దుఃఖిస్తుండగా ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నువ్వు విచారించకు. ఈ సమీపముననే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి. శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమము అవుతాడు” అని పలికిన మాటలు ఆకాశమునుంచి వినిపించాయి.
వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా! నీకు ఏమి కావలో కోరుకో” అని అనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారు లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములు నన్ను రక్షించి పోషిస్తున్నాయి. మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని వెళ్ళండి. ఇంకేమీ అక్కరలేదు” అని ప్రార్థించాడు.
“ఓ రాజనందనా! నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరము ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి, నీతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్ళు” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరునితోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు.
సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తానును వెతికి వారి జాడ తెలియక విచారముతో రాచకార్యములు చూడడము మానివేసాడు. ఆ సమయములో మునివెంట రాజకుమారుడు వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మవృత్తాంతం తెలియ చేసేసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment