మాఘపురాణం - 25వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘపురాణం - 25వ అధ్యాయము


సులక్షణ మహారాజు వృత్తాంతము


వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి నూరుగురు భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి నివారణ చేసేవాడు.


సులక్షణ మహారాజు రాజాధిరాజైనా, తరగని సంపత్తికలవాదు అయినప్పటికీ “అపుత్రస్యగతిర్నాస్తి” అన్నట్టుగా పుత్రసంతానము లేకపోవడముచే తనకు గతులు లేవు కదా! తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది ? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు పడుతూ ఉండేవాడు.


ఒకనాడు తన రధమెక్కి నైమిశారణ్యములో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి వారికి నమస్కరించి -


“మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు నూరుగురు భార్యలు. ఒక్కరికీ సంతానము కలుగలేదు. నాకు ఎలా పుత్రసంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులు జాలికలిగి - “రాజా! నీకు సంతానము లేకపోవుటకు కారణము – పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒక్కసారి అయినా మాఘస్నానము చేయలేదు. ఏ ఒక్క దానము ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయను అయినా దానము చేసి ఉంటే ఈ జన్మలో పుత్రసంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్రసంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండమును దానము చేసినవారికి సందేహము లేకుండా తప్పక పుత్రసంతానము కలుగుతుంద” ని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి “దీనిని నీ భార్యలతో తినిపించమని ” చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు.


భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద దీర్చారు. రాజు తెచ్చిన మంత్రఫలము గురించి వివరించి “భోజనానంతరం తినమ” ని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. నూరుగురు భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించాలని తలపోసి, రహస్య మార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుతున్నది.


సులక్షణ మహారాజు, అతని భార్యలు భోజనము చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పళ్ళెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. రాజుకు ఎక్కడలేని కోపంవచ్చి సింహగర్జన చేసాడు. మాకేమియు తెలియద” ని అందరూ ప్రమాణముగా చెప్పారు.


ఎంతో కష్టపడి మహామునుల అనుగ్రహము వలన సంపాదించిన మంత్ర ఫలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులుచెంది బెంగ పెట్టుకున్నాడు. చివరి భార్య “నాధా ! ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను. క్షమింపుమ” ని వేడుకొన్నది. 


వంశోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాబముగా చూసుకుంటున్నాడు.


కనిష్ఠభార్య గర్భవతి అయి నవమాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలా, ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు. వరపుత్రుడు పుడుతున్నాడు గనుక గర్భంలోని శిశువునకు ఏ అపాయము కలుగలేదు. ఔషధము యొక్క తీవ్రత వలన ఆమెకు పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది. అప్పటికే నిండు చూలాలయి ఉన్నందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగశిశువును ప్రసవించింది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసికట్టి వచ్చి ఆమెను చంపి తినేసింది.


ఆహారము కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూచి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరచి దానిపై పడుకో పెట్టి ఆ బాలునికి తేనె, పండ్లు తినిపించి ఒక ఏడాదివరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరములో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి.


ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తేనె మొదలగునవి తెచ్చి పెట్టి పెంచుతుండగా ఒక తపస్వి తన ఇద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయములో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్నబాలుని చూచి మక్కువ కలిగి వారివెంట తీసుకుని వెళ్ళారు.


వారి ఆశ్రమములో రాజకుమారునకు మూడు సంవత్సరములు వచ్చాయి. కొద్దికొద్దిగా మాటలు వస్తున్నాయి. వాడిని చూచి పెద్దభార్యకు ఈర్ష్య కలిగి, సాయంత్ర సమయమున ఆడుకొనుచుండగా పిల్లవాడిని ఎత్తుకోనిపోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగినా అసలు సంగతి చెప్పలేదు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు