మాఘపురాణం - 21వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥 మాఘపురాణం - 21వ అధ్యాయము
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట
దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసాడు.
త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించారు.
దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తు ఉండేవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొన్నాను. మాఘమాసం యొక్క మహత్యమును వినలేదు.
మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదని ” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు.
“భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా లేవు. అందులో 12 నదులు ముఖ్యమైనవి. అందుచేతనే వీటియందు పుష్కర ప్రవేశం కలుగుతు ఉంటుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆ నదులకు పుష్కరము ప్రారంభమగును. ఆ సమయమున ఆ నదులయందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించిన దాని వలన కలుగు ఫలమును వర్ణించుట ఎవరికీ సాధ్యం కాదు. మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యము కలుగుతుంది. ఏ మానవుడైననూ మాఘమాసములో నదీస్నానం తప్పకుండా చేయాలి. అలా చేయని మనుష్యుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు.
మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానము చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైననూ ముక్తి పొందగలడని దత్తాత్రేయుడు చెప్పసాగాడు.
పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము ఉన్నది. అక్కడ నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి అపర కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు ఉన్నాడు. గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొద్దీ ఉన్నవాడు.
మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోయిన తరవాత ఇద్దరన్నదమ్ములు ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినట్టు పాడుచేయసాగారు. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులు అయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తు ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరవడము చేత నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయాడు. ఆవిధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు.
యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి చిట్టాలు చూసి పెద్దవానిని నరకములో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. చిన్నవాడు చిత్రగుప్తుని -
“అయ్యా! మేము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒకేవిధముగానే పాపములు చేసాము. అయినా అతనికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తిస్తుంది?” అని అడిగాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు “ ఓ వైశ్యపుత్రా! నువ్వు నీ మిత్రుని కలుసుకొనుటకు ప్రతిదినము గంగానది దాటి ఆవలి గట్టున ఉన్న స్నేహితునితో సంభాషించి వస్తు ఉండేవాడివి. మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటమూలా యొక్క జల్లులు నీ శిరస్సుపై పడి నందువలన నీవు పవిత్రుడవైయ్యావు. మరొక విషయము ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశిస్తాయి. విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితము కలిగింది. ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును నువ్వు విన్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడి నీ పాపములు నశించునందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను” అని చిత్రగుప్తుడు వివరించాడు.
“ఆహా! ఏమి నా భాగ్యం! గంగాజలము మీద పడినంత మాత్రముననే నాకు ఇంతటి మోక్షం కలిగినది!” అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment