మాఘపురాణం - 20వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘపురాణం - 20వ అధ్యాయము


భీముడు ఏకాదశీ వ్రతము చేయుట


పంచపాండవులలో రెండవ వాడిన భీముడు మహాబలవంతుడు భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టింది. ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదాని భోజనం విషయంలో బెంగ ఉండేది. భోజనము చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి “ గురుదేవా ! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు గదా! దాని విశిష్టత ఏమిట?” ని భీముడు అడిగాడు.


“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటే ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు” అని పాండవ పురోహితుడు ధౌమ్యుడు చెప్పాడు.

“సరే నాకు అలా చేయాలని ఉన్నది గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగ? అని విచారిస్తున్నాను. ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలా, ఏకాదశీ వ్రత ఫలము దక్కేలా నాకు వివరించమని భీముడు అడిగాడు.


భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసినా కష్టములు కనిపించవు. నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి పుష్యమీ నక్షత్రముతో కూడినదై ఉంటుంది. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏది లేదు. సంవత్సరములో వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహా పర్వదినము. ఆ రోజు నియమము తప్పకుండా ఏకాదశి వ్రతము ఆచరించు. ఆకలి గురించి దిగులు పడకు. అని ధౌమ్యుడు భీమునకు వివరించాడు.

ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసము ఉన్నాడు. మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుస్తారు. ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసములోనే వస్తుంది. మహా శివరాత్రి మహత్యము గురించి కూడా వివరిస్తాను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో చెప్ప సాగాడు.


శివరాత్రి మహత్యము


ఏకాదశి మహావిష్ణువునకు ఎలా ప్రీతికరమైన దినమో అదేవిధముగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి. దీనినే ‘శివరాత్రి’ అని అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన రోజు. మాఘమాసములో వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి” అని అందరూ పిలుస్తారు. ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళితో బిల్వ పత్రములతో పూజించాలి. పూజించి శివప్రసాదము సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎంతటి పాపములు ఉన్నా అవన్ని వెంటనే హరించి పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది ఇంకొకటి లేదు. ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాఘమాసం కృష్ణ పక్షములో వచ్చు చతుర్దశి. అందరు జాతి బేధములతో నిమిత్తం లేక శివరాత్రి వ్రతము ఆచరించి జాగరణ చేయవలయును.


“పూర్వము శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడనే బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసిస్తు ఉండేవాడు. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. వాడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించటము తప్ప మరేమీ తెలియదు. జంతువులను వేటాడటములో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయేవి. అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.

ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు సాయంకాలము అవుతున్నా జంతువులు ఏమీ కంటపడలేదు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించక పొద్దు పోయినా అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూస్తున్నాడు. చలిఎక్కువ అవుతూ, మంచు కురుస్తున్నా కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరమును కప్పుకున్నాడు. అలా కప్పుకుంటున్న సమయములో ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడ్డాయి. ఆరోజు మహాశివరాత్రి రోజు బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియక చేసినా కొన్ని మారేడు పత్రములు శివలింగముపై పడ్డాయి. ఆ కారణము చేత శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడటము తిండిలేక ఉపవాసము ఉండటము ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసాయి.

జరామరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుష్యుడు తన జీవితమును గడపాలి.


మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణము ఆసన్నమై ప్రాణములు విడచిపెట్టాడు. యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుపోతుండగా కైలాసమునుంచి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు వెళ్ళారు. యమభటులు చేసేది లేక జరిగినది యమునితో చెప్పారు. యముడు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు.


శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద గణములతో కొలువు తీరివున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనము ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు.


యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను. నేను రావడమునకు కారణము ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకుతుందా ?” అని యముడు అడిగాడు.


యమధర్మరాజా! నాకు ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కుతుంది. ఈ బోయవాడు పాపాత్ముడయినప్పటికీ శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుజ్యము ప్రాప్తమయినదని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెళ్ళిపోయాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు